సుదీర్ఘ పోరాటాలు, ఆత్మబలిదానాలతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ నేతలు అపహాస్యం చేశారు. రైతు భరోసా యాత్ర పేరుతో కాంగ్రెస్ నేతలు రాజకీయ యాత్రలు చేయడం చూస్తుంటే ఇది నిజం అనిపిస్తోంది. రైతు ఆత్మహత్యల పేరుతో చేపట్టిన యాత్ర సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన సభలో కేంద్ర మాజీ మంత్రి పీ బలరాం నాయక్ మాట్లాడుతూ వచ్చే వరంగల్ ఉప ఎన్నికలో అందరూ కాంగ్రెస్ కు ఓటేయకపోతే తెలంగాణను తిరిగి ఆంధ్రాలో కలిపేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. తాను చేసిన ఈ వ్యాఖ్యల్లో తప్పేమీలేదని వేదికపైనే సమర్ధించుకోవడం పట్ల యావత్ తెలంగాణ సమాజం తీవ్రంగా మండిపడుతోంది. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు వెంటనే ఖండించాలని, లేకుంటే వాటిని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చిందని, సోనియాగాంధీ దయతోనే తెలంగాణ వచ్చిందని, అయితే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఓటేయకుండా టీఆర్ఎస్ కు ఓటేశారని బలరాం నాయక్ అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు వేదికపైన ఉన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, సీనియర్ నేత జానారెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీలు మద్దతు తెలుపుతున్నట్లు నవ్వడం గమనార్హం. ఇదిలాఉండగా బలరాం నాయక్ చేసిన ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ కు ఉన్న చిత్తశుద్ధికి బలరాం నాయక్ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని, తక్షణమే కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.