mt_logo

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ దే గెలుపు-కేసీఆర్

గురువారం మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో జరిగిన బహిరంగ సభలో టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక మొదటిసారి పాలమూరు జిల్లాలో అడుగుపెట్టానని, ఇక్కడి నేలకు, ప్రజలకు వందనం చేస్తున్నానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, 10 మంది ఎంపీలను గెలిపించుకుంటే కేంద్రం నుండి నిధులు సాధించుకుని తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించవచ్చని పేర్కొన్నారు. మెదక్ జిల్లా వాసినైనా తెలంగాణ ఉద్యమ సృష్టికర్త జయశంకర్ స్ఫూర్తితోనే తాను మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందానని గుర్తుచేశారు. ఏ జిల్లాలో పోటీ చేసినా కేసీఆర్ కు అన్ని జిల్లాల ప్రజలూ అండగా ఉంటారని పాలమూరు ప్రజలు నిరూపించారని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఇక పాలమూరు సస్యశ్యామలం అవుతుందని, పాలమూరు పచ్చబడే వరకూ నిద్రపోనని అన్నారు. 2002 లో ఆర్డీఎస్ కోసం పాదయాత్ర చేసినప్పుడు రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆర్డీఎస్ తూములను పేల్చేస్తానని ప్రజలను భయపెట్టాడని, ఆర్డీఎస్ ను పేల్చేస్తే సుంకేసుల ప్రాజెక్టును బద్దలుకొడతామని తాను హెచ్చరించినట్లు గుర్తుచేశారు. ఎన్నికల్లో గెలిచాక ఏడాదిలో కేసీఆర్ దెబ్బ ఏంటో చూపిస్తానని, ఆర్డీఎస్ కింద 87,500 ఎకరాలకు దగ్గరుండి నీరు పారిస్తానని, ఎవరడ్డం వచ్చినా ఊరుకోనని హెచ్చరించారు. వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని, ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వారి అభివృద్ధికై కృషిచేస్తామని హామీ ఇచ్చారు. గద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కృష్ణమోహన్ రెడ్డిని, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ భార్యను ప్రకటిస్తూ వారిని గెలిపించాలని కేసీఆర్ సభలో పాల్గొన్న ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *