ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని, మాది చేతల ప్రభుత్వమని, ప్రజలకు అవసరమైన కొత్త పథకాలను కూడా ఖర్చుకు వెనుకాడకుండా చేపడతామని నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీష్ రావు స్పష్టం చేశారు. మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా గజ్వేల్ లోని చౌదర్ పల్లిలో జరిగిన సమవేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నిరుపేద దళిత కుటుంబాలకు 3ఎకరాల భూ పంపిణీ ఆగస్టు 15నుండి ప్రారంభం అవుతుందని, పక్కా ఇళ్ళ నిర్మాణం జరుగుతుందని, అక్రమ రేషన్ కార్డులను ఏరివేస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు.
పంట రుణాల మాఫీ వల్ల 35లక్షల రైతు కుటుంబాలకు 19వేల కోట్ల రూపాయలు మాఫీ అవుతాయని, వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లు దసరా నుండి అందుతాయని స్పష్టం చేశారు. దళిత, గిరిజన ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 50వేల రూపాయలు అందిస్తుందని, బతుకమ్మ పండుగను అధికారికంగా జరపడమే కాకుండా జిల్లాకు కోటి చొప్పున ప్రభుత్వ నిధులను కేటాయిస్తామని చెప్పారు. ఉపాధి హామీ కూలీల డబ్బు వారం రోజుల్లోగా చెల్లించాలని అక్కడి అధికారులకు సూచించారు.