mt_logo

పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రలో విలీనం చేయడం అప్రజాస్వామికం: టిపిఎఫ్

పోలవరం ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టిపిఎఫ్) తీవ్రంగా ఖండిస్తున్నది.

కేబినేట్ ఆర్డినెన్స్ ఫైల్ పై రాష్ట్రపతి సంతకం చేసి ఆమోదం తెలపడంపై దేశ ప్రధమ పౌరుడైన రాష్ట్రపతి రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా ఆదివాసీ హక్కులను కాలరాసి నిర్ణయం తీసుకోవటాన్ని టిపిఎఫ్ ఖండిస్తున్నది. కేంద్రంలో బిజెపి అధికారంలోకి రాగానే బహుళజాతి కంపెనీలకు, గుత్త పెట్టుబడిదారులకు ప్రయోజనం కలిగించే విధంగా కోస్తాంధ్ర సంపన్నవర్గం టిడిపి చంద్రబాబు నాయుడు, బిజెపి వెంకయ్యనాయుడు నాయకత్వంలోనే ఉన్నది. తెలంగాణ ప్రజలను, ఆదివాసులను బలిపెడుతూ 1/70 చట్టానికి, పెసా చట్టానికి విరుద్ధంగా ఆదివాసులను నీటిలో ముంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చూడటం పూర్తిగా అప్రజాస్వామికం.

జూలై 30, 2013న తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా కేంద్ర కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న సందర్భంలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా కల్పించింది. ఆనాటినుంచి పోలవరం ప్రాజెక్టు రద్దుకై వివిధ ప్రజా సంఘాలతో, ఆదివాసీ సంఘాలతో కలసి తెలంగాణ ప్రజా ఫ్రంట్ పోరాడుతున్నది. ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తోంది.

కాంగ్రెస్, బిజెపి, టిడిపి, టిఆర్ఎస్ మొ. పార్లమెంట్ రాజకీయ పార్టీలన్నీ పోలవరం అంశాన్ని తమ ఓటుబ్యాంకు రాజకీయాలలో భాగంగానే చూశాయి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని, డిజైన్ మార్చాలని చేసే ప్రతిపాదనలు ఏవైనా సారాంశంలో పోలవరం ప్రాజెక్టును సమర్ధించడమే. పోలవరం ప్రాజెక్టును సమర్ధించడమంటే ముంపు మండలాలను పెట్టుబడిదారులకు బాలి ఇవ్వడం తప్ప మరో అర్థం ఉండదు. 7 మండలాల విలీన ప్రతిపాదనను, పోలవరం ప్రాజెక్టు రద్దుగురించి ఏనాడూ ఏ రాజకీయ పార్టీలూ మాట్లాడలేదు. పైగా పోలవరం టెండర్లలో, కాంట్రాక్టులలో భాగం అయ్యాయి. కేవలం డిజైను మార్చాలని, ఎత్తు తగ్గించాలని, ముంపు తగ్గించాలని అనివార్యంగా మాత్రమే మాట్లాడుతున్నారు. ఇప్పటి ప్రస్తుత పరిస్థితులలో 7 మండలాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ పోలవరం ప్రాజెక్టు రద్దు కోరుతూ అవిశ్రాంతంగా పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ఈ పరిస్థితులలో టిఆర్ఎస్ చేపట్టిన రేపటి బంద్ పోరాట పిలుపును స్వాగతిస్తూనే పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలనే వైఖరికి కట్టుబడి ఉండాలని టిపిఎఫ్ డిమాండ్ చేస్తోంది. కేవలం రాజకీయ అవకాశవాద ప్రకటనలకు, పిలుపులకు మాత్రమే పరిమితం కాకుండా ఆదివాసుల, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఎరిగి పనిచేసినప్పుడే రేపు అధికారంలోకి రానున్న టిఆర్ఎస్ ను ప్రజలు విశ్వసించగలరు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకున్న తెలంగాణ వ్యతిరేక నిర్ణయానికి వ్యతిరేకంగా ఆదివాసీ, దళిత ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు ఐక్యంగా ఉద్యమించాలని టిపిఎఫ్ కోరుతోంది. తెలంగాణ రాష్ట్ర సాధన స్ఫూర్తితో పోలవరం ప్రాజెక్టు రద్దు అయ్యేంతవరకూ, కేంద్ర క్యాబినెట్ నిర్ణయం వెనక్కు తీసుకునేంతవరకూ ఉద్యమం చేపట్టాలని పిలుపునిస్తున్నాం. భద్రాచలం డివిజన్ లో ఆదివాసీ సంఘాల నాయకత్వంలో జరుగుతున్న పోరాటానికి టిపిఎఫ్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది. ఆ పోరాటానికి మద్దతుగా విశాల తెలంగాణ ప్రజలు గొంతు కలపాలని, ఆదివాసుల ప్రజాస్వామిక హక్కుల సాధనకు విశాల తెలంగాణ సమాజం మద్దతుగా నిలవాలని టిపిఎఫ్ పిలుపునిస్తోంది. కలిసొచ్చే ఉద్యమ సంఘాలతో కలసి టిపిఎఫ్ పోరాడుతుంది. రేపటి నుండి జూన్ 3, 2014 వరకూ ఆదివాసీ సంఘాలు ఇచ్చిన పిలుపుకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టిపిఎఫ్ కోరుతోంది.

ఉద్యమాభి వందనాలతో……
తెలంగాణ ప్రజా ఫ్రంట్
ఎం. వేదకుమార్,
రాష్ట్ర ఉపాధ్యక్షులు,
రాష్ట్ర కో–ఆర్డినేటర్

నలమాస కృష్ణ
ప్రధాన కార్యదర్శి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *