ఈరోజు తెలంగాణ శాసనసభ ప్రారంభం కాగానే బుధవారం నాడు గవర్నర్ రెండు సభలనుద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ సాధ్యమని, తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ, రైతులకు లక్ష రూపాయలలోపు రుణం మాఫీ చేస్తామని, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. రైతులకు శాస్త్రీయ అవగాహన లేకనే పంటల దిగుబడి తగ్గుతుందని, నిజామాబాద్ లో పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కరెంట్ కోతకు గత ప్రభుత్వాల తప్పిదాలే కారణమని, కరెంట్ సరఫరా విషయంలో అప్పటి ప్రభుత్వాలు మాట తప్పాయని, రైతులకు 8గంటల కరెంట్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశించిన విధంగా తెలంగాణలో విద్య అందిస్తామని, కేజీ నుండి పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్య అందిస్తామని, ప్రతీ నియోజకవర్గంలో ఒక పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తామని సోమారపు సత్యనారాయణ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో వైద్యం సరిగా అందలేదని, పీహెచ్ సీలలో 24గంటల పాటు వైద్యం అందేలా చూస్తామని వెల్లడించారు. వచ్చే ఐదేళ్ళలో టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమం కోసం ఐదు లక్షల రూపాయలను కేటాయిస్తుందని, సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు తిరిగి అమలు చేస్తామని, ఆర్టీసీ కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.