ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కలుసుకుని రాష్ట్రానికి రావలసిన పెండింగ్ ప్రాజెక్టులు, వివిధ పథకాల కింద రావలసిన నిధులబకాయిలపై చర్చించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరయ్యేందుకు సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. సీఎం ఢిల్లీ పర్యటనలో ఆయనవెంట టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, బీ వినోద్ కుమార్, కవిత, సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు ఉన్నారు.
సీఎం కేసీఆర్ ను రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జీ జగదీష్ రెడ్డి కలుసుకుని సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రానికి ఉత్తమ అవార్డు వచ్చిన విషయాన్ని, ప్రధాని మోడీ చేతులమీదుగా దానిని అందుకున్న విషయాన్ని చెప్పారు. సాయంత్రం ఏడున్నర గంటలకు సీఎం కేసీఆర్, ఎంపీ కవిత తదితరులు నం. 9, అశోకా రోడ్ లో ఏర్పాటుచేసిన అమిత్ షా కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోడీ, పలువురు గవర్నర్లు, కేంద్రమంత్రులు, ఎంపీలతో పాటు అనేకమంది రాజకీయ నేతలు హాజరయ్యారు.
ఇదిలాఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం ప్రధాని మోడీని ఆయన నివాసంలో కలుసుకుని తెలంగాణ రాష్ట్రానికి తగినంత నిధులు కేటాయించాలని, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను వీలైనంత త్వరగా అమలు చేయాలని కోరనున్నారు. అంతేకాకుండా పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలను ఏపీ ప్రభుత్వం సరిగా అమలు చేయడంలేదని, విద్యుత్ సరఫరా వంటి అంశాల్లో చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తుందని కూడా వివరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలను వివరించడంతో పాటు కేంద్రం నుండి పూర్తి సహాయ సహకారాలను అందించాలని, పలు సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం ఆర్ధికసాయం అందించాలని కోరనున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు.