ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈరోజు అనేక అంశాలపై అఖిలపక్ష సమావేశం జరగనుంది. సెక్రటేరియట్ లోని సీ బ్లాక్ కాన్ఫరెన్స్ హాలులో మధ్యాహ్నం 2.30గంటలకు ఈ సమావేశంలో అన్ని పార్టీల నేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, మేయర్ తదితరులు పాల్గొననున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తొలి అఖిలపక్ష సమావేశం కానుండటంతో అందరి దృష్టి ఈ సమావేశంపైనే కేంద్రీకృతమై ఉంది. రంజాన్, బోనాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల ఫీజు రీయింబర్స్ మెంట్ అంశాలపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఏ పథకమైనా అందరితో చర్చించాకే అమలు చేస్తామని సీఎం కేసీఆర్ శాసన భ, శాసనమండలిలో హామీ ఇచ్చిన నేపథ్యంలో అన్ని పార్టీల నేతలకూ ఈ సమావేశాలకు హాజరుకావాలని ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది.