ఆంక్షలు లేని సంపూర్ణ తెలంగాణను సాధించుకోవడానికి టీజేఏసీ తన ఉద్యమ కార్యాచరణకు పదును పెట్టనుంది. జనవరి మొదటి వారంలో ధర్నాలు, సమావేశాలు, మహాధర్నాలతో తెలంగాణ సాధనకు పోరాటశంఖం పూరించనుంది. డిల్లీ పర్యటన, తెలంగాణకు మద్దతిస్తున్న జాతీయ పార్టీలతో సంప్రదింపులు ముఖ్య అంశాలుగా ఉంటాయి.
గురువారం రాష్ట్రపతితో సంప్రదించిన తర్వాత జేఏసీ సమావేశం నిర్వహించి, మహాధర్నా జరిగే రోజును తెలియజేస్తారు. నిజానికి జనవరి 6న మహాధర్నా జరగాల్సి ఉన్నా రాష్ట్రపతితో చర్చించిన తర్వాత తేదీని ఖరారు చేస్తామని టీజేఏసీ వివరించింది. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత 45రోజుల్లో సీమాంధ్ర రాజధాని ఎంపిక చేయాలని, అందులో ఏవిధమైన జాగు ఉండొద్దని టీజేఏసీ వాదన. రెండు సంవత్సరాలకన్నా ఎక్కువ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను వుంచొద్దని వారి ప్రతిపాదన.
నేటి టెక్నాలజీతో రెండు సంవత్సరాల్లోనే అన్ని హంగులతో రాజధానిని ఏర్పరుచుకోవచ్చని కూడా స్పష్టం చేసింది టీజేఏసీ. బిల్లులోని అంశాలను సవరిస్తూ చేసిన ప్రతిపాదనలను, సవరణలను ఒక నోట్ రూపంలో సిద్ధం చేసి, దాని కాపీలను తెలంగాణకు అనుకూలంగా ఉన్న లోక్ సభ, రాజ్య సభ పార్టీల నాయకులకు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. జీవో 36, 610 వివరాలను, తెలంగాణకు భారం కానున్న రిటైర్డ్ సీమాంధ్ర ఉద్యోగుల అంశాన్ని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివరాలను నోట్ రూపంలో అందించనున్నారు.