mt_logo

తెలంగాణలో జరగుతున్న అరాచక పాలనపై రాహుల్ గాంధీ సమీక్ష చేయాలి: హరీష్ రావు

మాజీ సర్పంచులు అరెస్టులపై తిరుమలగిరి పోలీసు స్టేషన్ లోపలి నుంచి, గోడ బయట ఉన్న మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. మాజీ సర్పంచుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది అని మండిపడ్డారు.

ఆరు గ్యారెంటీలు హక్కుగా కల్పిస్తామని ఎగనామం పెట్టారు. 11 నెలల నుంచి మా బిల్లులు రావడం లేదని మొత్తుకుంటుంటే సర్పంచులను రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేశారు. గల్లాలు పట్టుకొని డీసీఎంలో ఎక్కించారు.. వారిని ఎంతో అవమానించారు అని అన్నారు.

తెలంగాణ సర్పంచులు దేశానికి ఆదర్శం.. గొప్పగా పని చేసిన సర్పంచులను అరెస్టులు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రతిపక్షంలో ఉన్నపుడు బిల్లులు ఇవ్వడం లేదంటూ రెచ్చగొట్టారు.. ఎన్నికల సమయంలో అడ్డగోలుగా మాట్లాడారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి సర్పంచుల చేతులకు సంకెళ్లు వేస్తున్నారు అని దుయ్యబట్టారు.

రూ. 1,200 కోట్లు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు, రూ. 300 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు, రూ. 500 కోట్ల ఎన్‌హెచ్ఎం నిధులను డైవర్ట్ చేశారు. ఆ నిధులను గ్రామ పంచాయతీలకు ఎందుకు విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు, కేంద్రం నుంచి వస్తున్న నిధులను డైవర్ట్ చేస్తారు అని విమర్శించారు.

సర్పంచుల సంఘం అధ్యక్షుడు అరెస్టు అయ్యి మాతో ఉన్నడు. ముఖ్యమంత్రి అంత బిజీగా ఉన్నరా? వారికి ఎందుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటూ గప్పాలు కొట్టారు. నిర్బంధాలు, అరెస్టులతో ప్రతి రోజుల రాష్ట్రం అట్టుడుకుతున్నది అని ధ్వజమెత్తారు.

రాహుల్ గాంధీ గారు రేపు తెలంగాణకు వస్తున్నారు.. అశోక్ నగర్ నుంచి నిరుద్యోగులు వచ్చి ఈరోజు నన్ను కలిశారు. ఎన్నికల సమయంలో అశోక్ నగర్ లైబ్రరీకి వెళ్లి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తమని నమ్మబలికారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అని హరీష్ రావు అన్నారు.

నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఆరోజు లైబ్రరీ మెట్ల మీద కూర్చొని మాట్లాడారు. 2 లక్షల ఉద్యోగలు ఎప్పుడు ఇస్తారు, ఇప్పటికి ఎన్ని ఇచ్చారు చెప్పండి. జీవో 29 రద్దు చేయాలని కోరుతున్నారు.. చర్చించిండి. ఓట్లప్పుడే కాదు అధికారంలోకి వచ్చాక కూడా రావాలి అని సూచించారు.

ఆరు గ్యారెంటీల ప్రభావం మహారాష్ట్ర ఎన్నికల మీద కూడా పడుతుంది. రాహుల్ గాంధీ గారు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు మీద సమీక్ష నిర్వహించండి. 300 రోజులు అయినా హామీలు అమలు కావడం లేదు. తెలంగాణలో జరగుతున్న అరాచక పాలనపై సమీక్ష చేయండి అని సలహా ఇచ్చారు.

నీ మొండి ముఖ్యమంత్రికి చెప్పు రాహుల్ గాంధీ.. పేదల ఇల్లు కూలగొడుతున్నడు, పోలీసుల రాజ్యం నడుపుతున్నడు.. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నడు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం కాదు, ఆయన తెచ్చిన 73,74 సవరణల ప్రకారం వచ్చిన స్థానిక సంస్థల ప్రతినిధులైన సర్పంచుల సమస్యలు పరిష్కరించు.. పెండింగ్ బిల్లులు క్లియర్ చెయ్యి. పల్లెప్రగతి బంద్ చేసినవు, గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసినవు. రాజీవ్ గాంధీ మీద నీ ప్రేమ నిజమైతే పెండింగ్ బిల్లులు చెల్లించు అని సవాల్ విసిరారు.

11 నెలల్లోనే అన్ని వర్గాలను నడిరోడ్డుమీదకు తెచ్చిన ఘనత నీది రేవంత్ రెడ్డి. రాష్ట్రం అప్పుల పాలైందని తప్పుడు ప్రచారం చేశావు, నువ్వు తెచ్చిన రూ. 85 వేల కోట్లు అప్పు ఏం చేశావో సమాధానం చెప్పు. నీ నియంతృత్వ పాలన నడుస్తున్నది. పోలీస్ స్టేషన్లకు నిధులు ఇవ్వకపోవడంతో బేడిలనే తాళాలుగా ఉపయోగిస్తున్న పరిస్థితి అని హరీష్ రావు ఎద్దేవా చేశారు.