యాదగిరిగుట్ట అభివృద్ధి, గుడి చుట్టుపక్కల ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దటం కోసం తయారైన డిజైన్లను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. యాదగిరిగుట్టపై సుమారు ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ప్రధాన దేవాలయ ప్రాంగణంతో పాటు నాలుగు రాజగోపురాలు, నాలుగు మాడవీధులకు సంబంధించిన డిజైన్లను, భక్తులు నడిచే కాలినడక మార్గం, ఇతర ఆలయాలను, పశ్చిమాన ఉన్న ప్రధాన ద్వారం తదితర డిజైన్లను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆద్యాత్మికత ఉట్టిపడేలా, భక్తిభావం విరాజిల్లేలా, మనస్సుకు ఆహ్లాదం కలిగించేలా, ప్రకృతి అందాలు ద్విగుణీకృతం అయ్యేలా యాదగిరిగుట్ట తెలంగాణ రాష్ట్రానికే వన్నె తెచ్చేలా ఉండాలని అన్నారు. ప్రస్తుతం గుహలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మూల విరాట్ యథాతథంగానే ఉండాలని, మిగతా ప్రాంతమంతా ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని సీఎం ఆలయ శిల్పులకు సూచించారు. గతంలో నిర్వహించిన సమీక్షా సమావేశాల్లోనే కాకుండా యాదగిరిగుట్టను సందర్శించినప్పుడు సీఎం కేసీఆర్ చేసిన సూచనలకు అనుగుణంగానే ఆలయానికి సంబంధించిన డిజైన్లను రూపొందించినట్లు ఆలయ శిల్పులు చెప్పారు.
గుట్టపై ఒకేసారి 30 వేలమంది భక్తులు తిరిగినా ఇబ్బంది కలుగని విధంగా నిర్మాణాలు ఉండాలని, భక్తులు సేదతీరేందుకు వీలుగా గుట్ట ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. అంతేకాకుండా ప్రధాన గుట్టతో పాటు ఇతర గుట్టలను కూడా అందంగా తీర్చిదిద్దాలని, అతిథి గృహాలు, అందమైన ఉద్యానవనాలు, కాటేజీలు, విశాలమైన రోడ్లు, గుట్టపైకి వచ్చి వెళ్ళడానికి వేర్వేరు రోడ్లు ఉండాలని అన్నారు. యాదగిరి గుట్ట సమీపంలోని బస్వాపూర్ చెరువును పెద్ద రిజర్వాయర్ గా మారుస్తామని, రిజర్వాయర్ కు అనుబంధంగా మైసూర్ బృందావన్ గార్డెన్ తరహాలో థీమ్ పార్కును నిర్మించాలని చెప్పారు. యాదగిరి గుట్ట ప్రాంతమంతా సెంట్రలైజ్డ్ మైక్ సిస్టం ఉండాలని, నిత్యం స్తోత్రాలు వినిపించాలని, భక్తులకు సరిపడే విధంగా మంచినీటి సరఫరా ఉండాలని, మెరుగైన మురుగునీటి నిర్వహణ ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో యాదగిరిగుట్ట డెవెలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్, సీఈవో జే కిషన్ రావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఎంపీలు కే కేశవరావు, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.