mt_logo

ది జర్నీ ఆఫ్ తెలంగాణ

By: రాణి రుద్రమ

భూమికి మనం పై భాగాన ఉన్నామనుకుంటే సరిగ్గా మనకు సూటిగా కింది భాగాన ఉండే దేశం అమెరికా. దగ్గర దగ్గర 24 గంటల ప్రయాణం. ఏడు సముద్రాలు, ఖండాంతరాలు దాటితే గాని చేరుకోలేని దేశం. అమెరికా వెళ్లాలన్న ఆలోచన ఎన్నడూ లేని నేను ఆటా (అమెరికా తెలుగు అసోసియేషన్)లోని తెలంగాణ ప్రతినిధుల ఆహ్వానం మేరకు ‘టీ-న్యూస్’ తరపున బయల్దేరిన. హైద్రాబాద్ మొదలు అట్లాంటా దాకా అదృష్టవశాత్తు కిటీకి పక్క సీటు లభించింది. ఎదురుంగున్న మానిటర్‌ల మూవింగ్ మ్యాప్ ఓపెన్ చేసుకొని కూర్చున్న. మనం ఎంత ఎత్తున ఉన్నం, ఏ దేశం మీదినుంచి పోతున్నమో అది సూచిస్తుంది. మ్యాప్ ఫాలో అవుకుంట కిందకి చూస్తే ఆయా దేశాల భౌగోళిక స్వరూపం మనకు కనిపిస్తది. అట్ల మబ్బుల మీది ప్రయాణం. ఎనుకటి సినిమాలల్ల గంధర్వలోకం కనబడుతున్నట్టుంటది. చిన్నప్పుడు సాంఘికశాస్త్రంల చదువుకున్న దేశాలు, సముద్రాలు, దిక్కులు అన్నింటినీ చూసుకుంట, జర్నీని ఆస్వాదిస్తూ పోయిన నాకు ఎక్కడ అమెరికా కనబడలేదు. అంతటా తెలంగాణమే వినిపించింది, కనిపించింది. అందుకే నా ప్రయాణాన్ని ‘జర్నీ ఆఫ్ అమెరికా’ అనుకునుడు కంటే ‘జర్నీ ఆఫ్ తెలంగాణ’ అనుకునుడే సరైంది.
దారిలో పోయేటప్పుడు లండన్ నుంచి అట్లాంటా దాకా లక్ష్మిపార్వతి, నారదాసు లక్ష్మన్‌రావు, ఇంకొంత మంది టీఆర్‌ఎస్, టీడీపీ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సీలు అందరం ఒకే ఫ్లైట్‌ల పోయినం. అక్కడ ఒకరిద్దరితో తెలంగాణ మీద చర్చ జరిగింది. అట్లాంటాల ఎయిర్‌పోర్ట్‌కి నన్ను రిసీవ్ చేసుకునేటందుకు మా బావ, తన స్నేహితుడు వచ్చిండ్రు. కనిపియ్యంగనే మొదటి పలకరింపు ‘జై తెలంగాణ’, వెల్‌కం టూ అమెరికా అని. ఆన్నుంచి డైరెక్ట్‌గా ‘ఆటా’ కన్వీనర్ కరుణాకర్ అసిరెడ్డితో పాటు కోర్ మెంబర్స్‌ని కలిసేటందుకు వెళ్లిన. అందరూ ఒకేసారి ‘జై తెలంగాణ’ అంటూ పలకరించిండ్రు. కొంత ఆశ్చర్యం, కొంత సంతోషం. పలకరింపులు పూర్తయినంక ఇంకో మిత్రుడి ఇంట్లో డిన్నర్. నేను పొయ్యేటాళ్లకే బిజేపీ రాంచందర్రావు, యెన్నం శ్రీనివాసరెడ్డి ఇంకా కొంతమంది ఉన్నారు. ఆడ గూడ తెలంగాణ చర్చే.

నిన్న మొన్నటి దాన్కా విదేశాల్లో తెలుగు సభలు ఏవి జరిగినా అంతటా సీమాంధ్రప్రాన్త వాసుల ఆధిపత్యం కొట్టొచ్చినట్టుండేది. మొదటిపాలి అట్లాంటాలో జరిగిన ఆటా ఉత్సవాల్లో ‘జై తెలంగాణ’ నినాదాలు మార్మోగినయి. తెలంగాణ బిడ్డల ఆధిపత్యంలో అంత పెద్ద కార్యక్రమం ఆద్యంతం మూడు రోజుల పాటు ఆసక్తికరంగా దిగ్విజయంగా కొనసాగింది. చాన సార్లు నాకయితే నేను మా ఊళ్ళె ఉన్ననా లేక అమెరికాల్నే ఉన్ననా అనిపించింది. దగ్గర దగ్గర 8 వేలమంది జనం. మెజారిటీ తెలంగాణోళ్లమే. కనిపించిన ప్రతి ఒక్కరి మొదటి ప్రశ్న ఒక్కటే. ‘తెలంగాణ రాష్ట్రం ఎప్పుడొస్తది? అసలొస్తదా? కేసీఆర్ ఏమంటున్నరు?’ అని!
పద్నాలుగు రోజుల నా ప్రయాణంలో కనీసం 1400 మంది మన తెలంగాణ అన్నదమ్ములు, అక్క చెల్లెండ్లు అడిగిన మొదటి ప్రశ్న అదే. ఎవలన్న ఇంతదూరం ప్రయాణం జేసి అమెరికాల కనబడితే ‘ఎట్లున్నరు? పైలమేనా’ అనడుగుతరు? కాని, అందరూ ‘జై తెలంగాణ సిస్టర్’ అంటూ పలకరించినోళ్ళే.

ఒక రోజు తెలిసిన దోస్తుల కుటుంబం ఆహ్వానిస్తే డిన్నర్‌కి పోయిన నేను. నన్ను పిలిచినోళ్లది మా వరంగల్ జిల్లా. డిన్నర్ కొచ్చిన వాళ్లలో వాళ్ల దోస్తులు ఒకరు కర్నూలుకి, ఇంకొకరు తూర్పు గోదావరికి చెందిన కుటుంబాల వాళ్లు. వాళ్లింట్ల ఉన్నంతసేపు తెలంగాణ అంశమే ప్రధాన చర్చ. మధ్యల ఒకసారి ‘మీది ఏ జిలా?’ అని ఒకావిడను అడిగిన నేను.‘హైద్రాబాద్’ అన్నారావిడ. నిజానికి వాళ్ల నాన్నగారిది కర్నూలు, అమ్మది తెనాలి. ఆవిడ ఖమ్మంల పుట్టిండ్రు. కాని, హైద్రాబాద్ అని చెప్పుకుంటున్నరు. పదేండ్లకు ముంగట మన తెలంగాణ బిడ్డలు ‘మీది ఏ ఊరు?’ అనడిగితే ‘హైద్రాబాద్’ అని తప్ప జిల్లాల పేర్లు చెప్పే సాహసం చేసేటోళ్లు గాదట. ఇయ్యాల సీన్ రివర్సయింది. మలి తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని రొమ్ము విరిచి, గుండెమీద చెయ్యేసుకొని ‘నేను తెలంగాణ బిడ్డను, నా ఊరు ఇది. నా జిల్లా ఇది’ అని సగర్వంగా తలెత్తుకొని చెప్పుకుంటున్నరు మనోళ్లు.

మూడు రోజుల ‘ఆటా’ మహాసభల్లో ఏ మీటింగ్ దగ్గర, ప్రోగ్రాం దగ్గర లేనంత మంది టిడిఎఫ్ (తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం) మీటింగ్‌కు హాజరయ్యిండ్రు. ఇటు టీఆర్‌ఎస్, అటు బిజేపీ రెండు పార్టీలను మాత్రమే తెలంగాణ అనుకూల పార్టీలుగా గుర్తిస్తూ విమర్శలకు తావివ్వకుంట, తెలంగాణ తెచ్చే మార్గం చెప్పమనుకుంట కార్యక్రమం మొదలు పెట్టిండ్రు.

ఇగ మన ‘టీ-న్యూస్’ అమెరికాలో తెలంగాణ కార్యక్రమంల అయితే మూడేండ్ల పాప, వాళ్లమ్మ మధ్యలోంచి తీసుకుపోతుంటే ఏడుపు లంఖించింది. ‘ఏందని’ అందరు అటు తిరిగిండ్రు. “ఎందుకేడుస్తున్నవని” నేనడిగితే “జై తెలంగాణ చెప్పకముందే మా అమ్మ తీసుక పోతాంద”ని ఏడ్చుకుంట చెప్పేటాలకు హాలంతా ఒకపాలి చిన్నబోయింది. 200 మందిల ఒక్కలు గూడ ఏం మాట్లాడలేదు. ‘టీన్యూస్’ మైక్ నేను పాప చేతికిస్తే కండ్లల్ల నీళ్లు తుడుచుకుంట “జై తెలంగాణ” అన్నది. 200 గళాలు, 200 చేతులు పైకి లేచినయి. ఒక క్షణం పాటు ఉద్విగ్న వాతావరణం, హాలు మొత్తం దద్దరిల్లింది.

‘ఆటా’లో తెలంగాణం ఎంతగా వినిపించిందంటే, ఆఖరికి సమైక్యాంధ్ర భావజాలం నరనరాలల్ల ఇంకి ఉన్న ఒక ఛానల్‌లో పనిచేసే నా పాత సహోద్యోగి, మిత్రుడొకరు స్వయంగా “అంతటా మీ రాజ్యమే నడుస్తోంది తల్లీ, ఇప్పుడంతా మీ టైమే” అన్నాడంటే ఏ స్థాయిలో అగ్రరాజ్యాన తెలంగాణ మట్టి వాసనలు పరిమళించినయే అర్థం చేసుకోవచ్చు. ఆ తరువాత జరిగిన వాషింగ్టన్ టూర్‌లో వేణు నక్షత్రం భార్య ఎయిర్ పోర్ట్ కొచ్చి పికప్ చేసుకున్నరు. వాళ్లింట్ల అడుగు పెట్టంగనే మొదట కనిపించింది జయశంకర్ సార్ ఫొటోతో కూడిన పెద్ద తెలంగాణ పోస్టర్.

ఆన్నుంచి వాషింగ్టన్ టిడిఎఫ్ కోర్ కమిటీ ఫ్యామిలీస్‌తో డిన్నర్ జగదీష్‌రెడ్డి ఇంట్లో జరిగింది. వాషింగ్టన్‌ల తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా వాళ్లు చేసిన కార్యక్రమాలన్నీ ప్రొజెక్టర్ ద్వారా చూపించిండ్రు. రియల్లీ గ్రేట్. వాకిట్ల కనకాంబరం మొక్క చూడంగనే మా అమ్మ జ్ఞాపకమొచ్చింది. అయిటి పూనంగానే కనకాంబరాల నారు పోసి మనమెట్ల ఇష్టంగ పెంచుకుంటమో, వాళ్లట్లనే పెంచుకుంటున్నరు. అట్లాంటలో నర్సింహారెడ్డి ఇంట్లనయితే ఏకంగా పట్నంబంతి తోటే ఉన్నది. ఇగ న్యూయార్క్ చిల్లా రమేష్ బిడ్డలు ఇంగ్లీష్‌ల రాసుకొని తెలంగాణ ఉద్యమగీతాలు పాడుతుంటే ‘అసలు ఉద్యమం తెలంగాణల నడుస్తుందా? అమెరికాల నడుస్తుందా?’ అనిపించింది. నిజామాబాద్ రమణారెడ్డి బిడ్డను 21వ రోజునాడు తొట్టెలేసే ఫంక్షన్‌కి పిలిస్తే పోయిన. వచ్చేటపుడు వాళ్ళు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు ప్యాక్ చేసిస్తే ఇండియా దాకా కొంగున కట్టుకొని తెచ్చుకున్న నేను.

మొత్తానికి ‘ఆటా’ మహాసభల్లో తెలంగాణ జాతర జరిగింది. తెలంగాణ నగారా మోగింది. మొత్తం అమెరికాల ప్రతి రాష్ట్రంల ఉన్న మన తెలంగాణ బిడ్డలు ఒక్కచోట కొచ్చిండ్రు. మన భాష, మన యాస, మన ఆశ, ఆకాంక్ష, మన కట్టు, బొట్టు, మన చెట్టు, చేమ, మన తిండి…ఒక్క మాటలో చెప్పాలంటే మన బతుకును అంత దూరం విమానంల మోసుకుపోయి అల్లంత దూరాన అమెరికాల ఆవిష్కరించిన భూమిపుత్రులు మన తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు.

మన నోటికాడి కూడు లాక్కున్న అనుభవం మనకున్నది. వాకిట్లకు, గలమదాన్క వచ్చిన తెలంగాణ ఇంట్లకు రాకుండ ఆగిన సందర్భం మనకు ఎరుకయిందే. కాని, భూమ్మిద గాలి ఏడిదాకుంటే ఆడిదాక తెలంగాణ అకాంక్ష వ్యాపించింది. ఇక తెలంగాణ నాపుడు దేవుడి తరం గూడా కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన తథ్యం.
విదేశాన గూడా మన తెలంగాణ తల్లి ఆత్మ గౌరవాన్ని సగర్వంగా నిలబెడుతున్న మన ఎన్‌ఆర్‌ఐ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళకు ఉద్యమాభివందనాలతో…

‘జై తెలంగాణ’
వ్యాసకర్త అసిస్టెంట్ ఎడిటర్, టీ-న్యూస్

[నమస్తే తెలంగాణ నుండి]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *