తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ ఆదివారం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో భారీ ఎత్తున జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ఇంకా టీజేఏసీ చైర్మన్ కోదండరాం, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు, బీజేపీ నేతలు, టీఆర్ఎస్ నేతలు, హైదరాబాద్ జేఏసీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సభకు టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీ. విఠల్ అధ్యక్షత వహించారు. రాజనర్సింహ మాట్లాడుతూ, తెలంగాణ కల ఫిబ్రవరిలోగా సాకారమవుతుందని, సోనియాగాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని పేర్కొన్నారు. సీమాంధ్ర నేతలు తెలంగాణ రాకుండా కుట్రలు పన్నుతున్నారని, మనల్నే కాక సీమాంధ్ర ప్రజలను కూడా మోసం చేస్తున్నారని, వారి కుట్రలను ఎలాగైనా జనవరి 3న జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తిప్పికొట్టాలని అన్ని పార్టీల తెలంగాణ నాయకులకు పిలుపునిచ్చారు. అధిష్టానం ముందు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి తెలంగాణ ఉద్యోగుల సంఘం ఇచ్చిన సమాచారమే ఉపయోగపడిందన్నారు.
జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం తుది దశకు చేరుకుందని, బిల్లు పార్లమెంటు ఆమోదం పొందేంతవరకు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఉద్యోగ సంఘాల డైరీలన్నీ వజ్రాయుధాలని కోదండరాం స్పష్టం చేశారు. మహాకవి కాళోజీ చెప్పిన “విడిపోతే భూమి కూలిపోదనే” వ్యాఖ్యలను ఫ్లెక్సీలుగా జనవరి 3న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గన్ పార్క్ వద్ద ఉంచాలని పేర్కొన్నారు. బిల్లు సవరణలు చేసి పార్లమెంటులో త్వరగా ప్రవేశబెట్టాలని కోరుతూ జనవరి 7న మహాధర్నా తలపెట్టామని, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు.
తెలంగాణకు బీజేపీ అనుకూలమేనని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, జనవరి ౩న ఆర్ట్స్ కాలేజీ, అసెంబ్లీలలో తెలంగాణ నినాదం మారుమోగాలని, 2001 లోనే కేసీఆర్ తెలంగాణ కోసం శాసనసభలో నినాదం చేసే రోజు వస్తుందని చెప్పారని ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ గుర్తు చేశారు.