mt_logo

తెలంగాణపై పెత్తనం సాగించడానికే చంద్రబాబు కుట్రలు – హరీష్ రావు

హైదరాబాద్ లో శాంతిభద్రతల నిర్వహణ గవర్నర్ కు అప్పగించడం టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర అని, కేంద్రాన్ని, గవర్నర్ ను అడ్డం పెట్టుకుని తెలంగాణపై సీమాంధ్ర పెత్తనం కొనసాగించేందుకు కుట్ర జరుగుతుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టీ హరీష్ రావు మండిపడ్డారు. హైదరాబాద్ పై గవర్నర్ పాలన కోరుతూ ప్రధానికి చంద్రబాబు లేఖ వ్రాయడాన్ని తప్పుపడుతూ హరీష్ రావు మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు ఒకవైపు చర్చల ప్రతిపాదన చేస్తూనే మరోవైపు తెరవెనుక కుట్రలు చేస్తున్నారని అయన విమర్శించారు.

రాష్ట్రం విడిపోతే కార్యాలయాలు లేవు, నాలుగురోజులు ఇక్కడ తలదాచుకుంటాం అంటే ఒప్పుకున్నాం. కొంచం చనువిస్తే ఇల్లంతా నాదేనన్న తీరుగా సీమాంధ్ర నేతలు వ్యవహరిస్తున్నారు. మమ్మల్ని వెళ్ళగొడతారా? మేము తెలుగువాళ్ళమే కదా.. కలిసి ఉంటే నష్టమేంటన్నారు? పదేళ్ళు ఉన్నాక మాం ఊళ్లకు మేము పోతామని అన్నారు. కానీ ఇప్పుడేం చేస్తున్నారు? హైదరాబాద్ నే తమ గుప్పిట్లో పెట్టుకోవాలని కుట్రలు చేస్తున్నారని అన్నారు.

సచివాలయంలో బారికేడ్లు పెడితే తెలంగాణ, ఆంధ్రా ఏమైనా ఇండియా, పాకిస్థాన్ లాంటి దేశాలా? అని బాబు గగ్గోలు పెట్టాడు. ఇనుప కంచెలు వేస్తారా? అని ఎగిరాడు. మరిప్పుడెందుకు హైదరాబాద్ లో కూడా ఆంధ్రా పోలీసులు ఉండాలని డిమాండ్ చేస్తున్నాడని హరీష్ ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలలాగే తెలంగాణ కూడా ఒక ప్రత్యేక రాష్ట్రం. ఒక్క తెలంగాణ రాజధానిలోనే గవర్నర్ కు ఎందుకు ప్రత్యేక అధికారాలుంటాయి? ఇది రాజ్యాంగ విరుద్ధం, అనైతికం అని పేర్కొన్నారు.

గవర్నర్ పాలన, కేంద్ర ప్రభుత్వ జోక్యంపై టీడీపీ విధానమేమిటని? ఎన్టీఆర్ బతికున్నప్పుడు కేంద్రం మిధ్య అని, గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేయలేదా? అని, గవర్నర్ ఎప్పుడూ కేంద్రం చేతిలో కీలుబొమ్మ కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో గవర్నర్ ఉండొద్దని పార్టీ విధాన పత్రాల్లో పేర్కొనడం గుర్తులేదా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఆశయ సాధనే టీడీపీ లక్ష్యమని చెప్పుకున్న మీరు ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని, ఏది అనుకూలంగా ఉంటే అదే మాట్లాడుతారా? మీది పొలిటికల్ పార్టీనా? లేక చెత్తబుట్టా? అని మండిపడ్డారు.

రాష్ట్రాల అనుమతి లేనిదే ఏ పనీ చేయవద్దని చెప్పిన బాబు ఇప్పుడు తెలంగాణ రాజధానిలో మా అనుమతి లేనిదే గవర్నర్ కు ఎలా అధికారాలు ఇస్తారని అన్నారు. హైదరాబాద్ లో వేరే రాష్ట్రాల ప్రజలూ ఉన్నారని, వారికి లేని భయం ఒక్క ఆంధ్రోళ్ళకే ఎందుకని? ఆ రాష్ట్రాల పోలీసు అధికారులను కూడా ఇక్కడ నియమించాలా? అని ప్రశ్నించారు. తెలంగాణ టీడీపీ నేతలు కూడా చంద్రబాబు లాగే గవర్నర్ పాలన కోరుకుంటున్నారో, లేదో చెప్పాలని, ఇంకా సీమాంధ్ర నాయకుడి మోచేతి నీళ్ళు తాగుతామంటే అది వారి ఖర్మ అని అన్నారు.

దీనిపై తెలంగాణ బీజేపే నేతలు కూడా సమాధానం చెప్పాలని, కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వమే కాబట్టి మీరు గట్టిగా కొట్లాడాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల హక్కులు కాపాడటానికి టీఆర్ఎస్, కేసీఆర్ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తుందని, హైదరాబాద్ లో గవర్నర్ పాలన ఉండదని అయన తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *