తెలంగానం 2015 పేరిట అమెరికాలోని కొలంబస్ నగరంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ సంబరాలు అంబరాన్ని అంటాయి. అమరులకు నివాళులు అర్పించిన అనంతరం తెలంగాణ జాతి పిత ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటానికి పూలదండ వేసి కార్యక్రమాన్ని ప్రారంబించారు. కొలంబస్ తెలంగాణ అసోసియేషన్(CTA) అధ్యక్షుడు రామకృష్ణ కాసర్ల, ఉపాధ్యక్షుడు నవీన్ కానుగంటి స్వాగతోపన్యాసం చేశారు.
నటి, యాంకర్ అనసూయ కార్యక్రమానికి వాఖ్యాతగా వ్యవహరించారు. ప్రముఖ గాయకుడు జనార్ధన్ పన్నెల తన పాటలతో సభికులను అలరించారు. తెలంగాణ ఆట, పాట, భరతనాట్యం, ధూమ్ ధామ్, నాటకాలు, స్కిట్స్, ఫాషన్ షో, మ్యూజిక్ మస్తీ మొదలగు 40 రకాల కార్యక్రమాలని ప్రదర్శించారు. రాణి రుద్రమ దేవి స్కిట్, పిల్లలు పెద్దలు కలిసి చేసిన ఫ్యాషన్ షో ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వ్యాప్తికి కృషి చేస్తున్న తెలంగానం నిర్వాహకులను పలువురు అభినందించారు.
తెలంగాణ అవతరణ దినోత్సవం కార్యక్రమ నిర్వాహకులు చాలా ఘనంగా జరిపారు.
కార్యక్రమ నిర్వహణకు CTA నాయకులూ, కమిటీ సభ్యులు అహోరాత్రులు కృషి చేశారు.
కొలంబస్ తెలంగాణ అసోసియేషన్(CTA) వారు నిర్వహించిన ఈ వార్షిక సాంస్కృతిక సంబరాల్లో 1000కి పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు.