సీఎం కేసీఆర్ ను కలిసిన అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, కృష్ణపట్నం విద్యుత్ ప్రాజెక్టులో వారం క్రితమే విద్యుత్ ఉత్పత్తి జరగాల్సి ఉండగా, తెలంగాణకు రావాల్సిన 54 శాతం విద్యుత్ రాకుండా చేసేందుకే ఉత్పత్తి ప్రారంభించలేదని మండిపడ్డారు. బంగారు తెలంగాణ సాధనలో పాలుపంచుకోవాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ కు, సీఎం కేసీఆర్ కు మద్దతు తెలుపుతున్నట్లు వివరించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే సమస్యలన్నీ పరిష్కరించలేక పోయారంటూ బస్సు యాత్రలతో ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాల్సిందిగా చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలకు చెప్పడాన్ని సహించలేకపోయామని, త్వరలోనే భారీ బహిరంగ సభ పెట్టి టీఆర్ఎస్ లో చేరుతామని తలసాని పేర్కొన్నారు.
33 సంవత్సరాలుగా టీడీపీలో ఉంటూ పార్టీ అభివృద్ధికి ఎంతో కష్టపడ్డామని, ఇప్పుడు తెలంగాణలో పార్టీ బాధ్యతలు లోకేష్ కు అప్పగించాలన్న నిర్ణయంతో నేతల ఆత్మాభిమానం దెబ్బ తిన్నదని వ్యాఖ్యానించారు. తెలంగాణ నేతలను కాదని లోకేష్ కు బాద్యతలు అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ, బంగారు తెలంగాణ సాధన కోసం తాము టీఆర్ఎస్ తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.