గ్రామ సచివాలయం నుండి రాష్ట్ర సచివాలయం వరకు తెలంగాణ ఉద్యోగులే ఉండాలని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలంగాణ ఉద్యోగసంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ అన్నారు. కొంపల్లిలో నిన్న జరిగిన సమావేశం వివరాలను ఆయన మీడియాకు వివరిస్తూ సీమాంధ్ర ఉద్యోగులపై మండిపడ్డారు. తెలంగాణ సచివాలయానికి సీమాంధ్ర ఉద్యోగులను కేటాయిస్తే గేటు లోపలికి కూడా రానివ్వమని ఆయన హెచ్చరించారు.
అసెంబ్లీ, సెక్రటేరియట్, హెచ్‌వోడీల్లో జరుగుతున్న ఉద్యోగుల పంపిణీని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, తమకున్న అభ్యంతరాలను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వివరించామని చెప్పారు. తెలంగాణ ఉద్యోగుల విభజనపైన, ఉద్యోగుల సమస్యలపైన కేసీఆర్ కు స్పష్టమైన అవగాహన ఉందని దేవీప్రసాద్ పేర్కొన్నారు.
806 మంది ఉద్యోగులను తెలంగాణ సెక్రటేరియట్ కు తాత్కాలికంగా కేటాయించారని, వారిలో 193 మంది సీమాంధ్ర ఉద్యోగులున్నారని, వారి స్థానికత వివరాలను ఉన్నతాధికారులకు అందించామని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వార్ రూమ్ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ఒప్పుకున్నారని, తెలంగాణ ఉద్యోగుల వివరాలన్నిటినీ వార్ రూమ్ కు తెలపాలని దేవీప్రసాద్ తెలంగాణ ఉద్యోగులకు సూచించారు.