మార్చి 2015 వరకు 100 మెగావాట్ల విద్యుత్ ను తెలంగాణకు సరఫరా చేస్తామని, అదనపు విద్యుత్ అందుబాటులోకి రాగానే 500 మెగావాట్ల విద్యుత్ ఇస్తామని కేంద్ర విద్యుత్, బొగ్గు శాఖామంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రెండురోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లి ప్రధాని, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణకు రావలసిన విద్యుత్, ఇతర అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే. ఆదివారం ఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నుండి మంత్రి పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ తనను కలిసి రాష్ట్రానికి ఎన్టీపీసీ నుండి 500 మెగావాట్ల విద్యుత్ కేటాయించాలని కోరారని అందుకు తాము అంగీకరించినట్లు తెలిపారు.
తెలంగాణలో కొత్తగా థర్మల్ విద్యుత్ ప్లాంట్ ల ఏర్పాటుకు సహకరిస్తామని, 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ను తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014 ప్రకారం తెలంగాణలో నాలుగువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ లు పెట్టాలని ఉందని, కోల్ బ్లాక్స్ పై సుప్రీంకోర్టు తీర్పు రాగానే కోల్ ఇండియాతో సంప్రదించి తెలంగాణలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని కేసీఆర్ కు చెప్పగానే అందుకు అవసరమైన 5 వేల ఎకరాల భూమిని వెంటనే చూపించారని, వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కూడా కేంద్రం సహకరిస్తుందని పీయూష్ తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి పెరిగితే త్వరలో 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేసేందుకు ఆస్కారం ఉంటుందని, ఈ విషయంలో అన్ని రాష్ట్రాల సహకారం అవసరమని చెప్పారు.