mt_logo

కోనసీమను తలపిస్తున్న తెలంగాణ పల్లెలు!

ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఈరోజు కొండపోచమ్మ సాగర్ లో చేపపిల్లలు వదిలారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వానలు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ పల్లెలు కోనసీమను తలపిస్తున్నాయని అన్నారు. కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడం, చేపలు విడుదల చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అని పేర్కొన్నారు. ఈ సంవత్సరం కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ లో 7.5 టీఎంసీల నీటిని నింపుతామని, 14 లక్షల చేప పిల్లలను విడుదల చేస్తామని చెప్పారు. ప్రతి చెరువు, రిజర్వాయర్, చెక్ డ్యాం లలో చేపపిల్లలను ఉచితంగా విడుదల చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో రొయ్యలను కూడా జలాశయాల్లో పెంచుతామని తెలిపారు.

గౌరారం మండల కేంద్రంలో జాతీయ కృత్రిమ గర్భదారణ రెండవ దశ కార్యక్రమాన్ని పశు సంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి హరీష్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ సిద్దిపేట నమూనాగా అన్ని జిల్లాల్లో గొర్రెల షెడ్లు నిర్మిస్తామని, రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. పాడిపై ఆధారపడ్డ వారి జీవితాల్లో వెలుగులు నిపుతామని, డీడీలు కట్టిన వారందరికీ గొర్రెలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. నరేగా కింద అర్హులైన వారందరికీ పశువుల, గొర్రెల షెడ్లను మంజూరు చేస్తామన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తలసాని పేర్కొన్నారు.

మరోవైపు సిద్దిపేటలో పలు అభివృద్ధి పనులకు హరీష్ రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సిద్దిపేట లోని బారాయిమామ్ చిన్న మసీదు సమీపంలో మంగళవారం రూ. 25 లక్షల వ్యయంతో నిర్మించనున్న పద్మశాలి సమాజ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *