-పౌరహక్కుల కోసం పోరాడిన యోధుడు: ఎన్ వేణుగోపాల్
-కాళోజీ కూడా తెలంగాణ జాతిపిత: దేశపతి శ్రీనివాస్
తెలంగాణ తొలి, మలి దశల ఉద్యమవారథిగా, ఈ ప్రాంత ధిక్కార స్వభావానికి ప్రతీకగా కాళోజీ నిలిచారని వీక్షణం సంపాదకుడు ఎన్ వేణుగోపాల్ కొనియాడారు. శుక్రవారం కాకతీయ విశ్వవిద్యాయలంలో కాళోజీ శతజయంతి సందర్భంగా ప్రజాస్వామిక విలువలు-కాళోజీ దృక్పథంపై తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎన్ వేణుగోపాల్ మాట్లాడుతూ పౌరసత్వం, పౌరహక్కుల కోసం పోరాడిన మొదటితరం వైతాళికుడు కాళోజీ అన్నారు. తెలంగాణ హక్కుల కార్యకర్తగా కాళోజీ నిర్వహించిన పాత్ర అనిర్వచనీయమన్నారు. నిరంకుశ, నియంతృత్వ, రాజరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడని ప్రశంసించారు.
1982లో ఓయూఆర్ట్స్ కళాశాల వేడుకలకు ముఖ్యఅతిథిగా కాళోజీని తీసుకురావడానికి వెళ్లినప్పుడు ఏలూరు కళాశాలలో విద్యార్థులపై కాల్పులు జరిగితే ఇక్కడ మీరు సంబురాలు చేసుకుంటారా అని ప్రశ్నించారని గుర్తుచేసుకున్నారు. ప్రజాకవి, గాయకుడు, టీవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ కోటిన్నర ప్రజల గొంతుక కాళోజీ నా గొడవ అన్నారు. తెలంగాణ జాతిపిత కీర్తి జయశంకర్‌తో పాటు కాళోజీకి కూడా వర్తిస్తుందన్నారు. ఎమర్జెన్సీ ఉద్యమం, పౌరహక్కుల ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో కాళోజీ కనబడతారన్నారు. సదస్సులో కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, కేయూ ప్రొఫెసర్లు బన్న అయిలయ్య, కే సీతారామారావు, జీ వీరన్ననాయక్, టీవీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ అయాచితం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.