సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పిట్టల రవి రచించిన తెలంగాణ ఉద్యమ డైరీ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీఎస్ పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, టీఎస్ పీఎస్సీ సభ్యుడు విఠల్ తదితరులు పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రొ. కోదండరాం మాట్లాడుతూ ఉద్యమ చరిత్రను తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుందని, తెలంగాణ ఉద్యమంలో సకల జనులు పాల్గొన్నారని అన్నారు. ఉదయం సందర్భంగా చోటుచేసుకున్న అనేక సంఘటనలను రికార్డు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
అనంతరం ఘంటా చక్రపాణి మాట్లాడుతూ చరిత్రను సృష్టించిందే తెలంగాణ వాళ్లు అని, మన చరిత్రను మనమే రాసుకునే అవకాశం వచ్చిందని అన్నారు. తెలంగాణ ఉద్యమానికున్న ప్రామాణికత ఉద్యమ డైరీలో తెలుస్తుందని అన్నారు. ఉద్యమంలో ఉద్యోగులు నిర్వహించిన పాత్రను రవీందర్ వివరించారని, తెలంగాణ చరిత్రకు ప్రామాణికత ఎక్కడని అడుగుతున్నారని, కానీ చరిత్రకు ప్రామాణికత అవసరం లేదని, ఉద్యమంలో పాల్గొన్న వారే ఇవాళ తెలంగాణ చరిత్రను రాస్తున్నారని చెప్పారు.