mt_logo

ఎవరెస్ట్ శిఖరంపై తెలంగాణ బిడ్డలు!

ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని తెలంగాణ బిడ్డలు అధిరోహించారు. పుట్టింది కడుపేదరికంలోనైనా, ఎంతో ఆత్మవిశ్వాసంతో అత్యున్నత శిఖరంపై అడుగుపెట్టి తెలంగాణ కీర్తి ప్రపంచం నలుమూలలా చాటారు. ఆంధ్రప్రదేశ్ సాంఘికసంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న నిజామాబాద్ బిడ్డ మాలావత్ పూర్ణ, ఖమ్మం జిల్లా విద్యార్థి ఆనంద్ కుమార్ 52రోజులపాటు కఠినమైన యాత్రను పూర్తిచేసి ఆదివారం ఉదయం 6 గంటలకు శిఖరం అంచుపై మువ్వన్నెల భారత జెండాను ఎగురవేశారు.

చుట్టూ ఎటుచూసినా ఎత్తైన కొండలు, మంచుపర్వతాలు, ఎముకలు కొరికే చలి. కానీ ఇవేవీ వాళ్లకు అడ్డుకాలేదు. వారి ఆత్మవిశ్వాసం ముందు హిమాలయాలు కూడా చిన్నబోయాయి. ఎవరెస్ట్ ఎక్కాలంటే శారీరకదారుడ్యమే కాకుండా మానసిక వికాసం, పట్టుదల, దృఢసంకల్పం తదితర అంశాలు ఉండాలి. చాలామంది ఈ యాత్రలో ప్రాణాలు విడిచారు. ఆక్సిజన్ కూడా తక్కువగా అందే వాతావరణం. శిఖరం చేరుకునే కొద్దీ మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. పెద్దలకే ప్రాణాంతకమైన ఈ యాత్రలో 13 ఏళ్ల పూర్ణ, 18 ఏళ్ల ఆనంద్ కుమార్ విజయం సాధించారు. అతి చిన్న వయసులో ఎవరెస్ట్ అధిరోహించిన బాలికగా పూర్ణ, 18 ఏళ్లకే విజయం సాధించిన తొలి దళితుడిగా ఆనంద్ రికార్డు సాధించారు.

వీరి విజయం వెనుక ఆంధ్రప్రదేశ్ సాంఘికసంక్షేమ గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రోత్సాహం, స్ఫూర్తి దాగిఉన్నాయి. వారిద్దరిలోని ప్రతిభను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించడం ద్వారా వారి కలను ప్రవీణ్ కుమార్ సాకారం చేశారు. వీరిద్దరిలో పూర్ణది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామం. ఆమె ప్రస్తుతం తాడ్వాయి మండలంలోని సాంఘికసంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతుంది. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ఐపీఎస్ అధికారి కావడమే తన లక్ష్యమని గతంలో పూర్ణ మీడియాకు తెలిపింది.

ఆనంద్ కుమార్ ది ఖమ్మం జిల్లా చర్ల మండలం కలివేరు గ్రామంలోని నిరుపేద దళిత కుటుంబం. తండ్రి సైకిల్ మెకానిక్, తల్లి వ్యవసాయ కూలీ. ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆనంద్ ఈ విజయం సాధించి అందనంత ఎత్తుకు ఎదిగాడు.

వీరిద్దరికి శిక్షణ ఇచ్చి వారి విజయానికి కారణమైన మరో వ్యక్తి శేఖర్ బాబుది కూడా నల్లగొండ జిల్లానే. 2007లో ఎవరెస్ట్ ను ఎక్కి ప్రతిష్టాత్మకమైన టెంజిన్గ్ నార్గే అవార్డును కూడా అందుకున్నారు. ఎవరెస్టును అధిరోహించి తెలంగాణ కీర్తిని హిమాలయాలంత ఎత్తుకు పెంచిన విద్యార్థులు ఆనంద్, పూర్ణలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభినందనలు తెలిపారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత,  టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల, విద్యావేత్త చుక్కా రామయ్య, ఓయూ విద్యార్థులతో పాటు పలువురు ప్రముఖులు వీరిద్దరికి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *