పోలవరం ముంపు మండలాలన్నీ తెలంగాణవేనని, అక్కడి విద్యార్థుల ఫీజులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమైన తర్వాత సచివాలయంలోని మీడియా పాయింట్ లో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారని, సీమాంధ్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో చదివే ఇతర రాష్ట్రాల పిల్లల ఫీజులు చెల్లించే ప్రసక్తే లేదని, ఏపీ విద్యార్థుల ఫీజు ఆ ప్రభుత్వమే చెల్లించాలని, విద్యార్థుల స్థానికతపై రెండు ప్రతిపాదనలు ఉన్నాయని, వాటిని సమీక్షిస్తామన్నారు. డీఎస్సీని ఇప్పట్లో నిర్వహించేదిలేదని, కేజీ నుండి పీజీ దాకా ఉచిత విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.