సౌర విద్యుత్ తో పాటు సంప్రదాయేతర, నూతన ఇంధన వనరులు అమల్లోకి తెచ్చినందుకు గానూ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక అవార్డును కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో ఆదివారం ప్రారంభమైన ప్రపంచ పునరుత్పాదక ఇంధనరంగ పెట్టుబడిదారుల(రీ ఇన్వెస్ట్) సదస్సులో ప్రధాని మోడీ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, 13వ ఆర్ధికసంఘం నిధులతో చేపట్టిన కార్యక్రమాల అమలుతో విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్దడంలో తెలంగాణలోని పది జిల్లాలు గొప్ప ఫలితాలు సాధించాయని, దేశంలోనే మెరుగైన ఫలితాలు సాధించిన 12 రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర్తం ఉండటం అభినందనీయమని ప్రశంసించారు.
ఏప్రిల్ 2010 నుండి మార్చి 2014 వరకు నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల(న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ) ఉత్పత్తిపై దృష్టి సారించడమే కాకుండా వినియోగంలోకి తీసుకొచ్చి ఉత్తమ ఫలితాలు సాధించినందుకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుకు తెలంగాణ ఎంపికైంది. సుమారు 900 మెగావాట్ల మేర సంప్రదాయేతర ఇంధనాన్ని ఉత్పత్తి చేసి రోజువారి అవసరాలకు వినియోగించింది. ఈ అవార్డును రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీష్ రెడ్డి, ఇంధనశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రధాని మోడీ చేతులమీదుగా అందుకున్నారు.