రాష్ట్ర విభజనలో భాగంగా హైదరాబాద్ ను పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ లోని సచివాలయం, శాసనసభ, శాసనమండలి, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేశారు. భవనాల పంపిణీ బాధ్యతను తీసుకున్న ఆర్అండ్‌బీ శాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సచివాలయంలోని బ్లాకులను రెండుగా విభజించింది. తెలంగాణకు ఏ, బీ, సీ, డీ బ్లాకులను, ఆంధ్రప్రదేశ్ కు జే, కే, ఎల్, ఎఫ్, హెచ్ సౌత్, హెచ్ నార్త్ బ్లాకులను కేటాయించారు. ఎక్కడైతే అవసరముందో అక్కడ మరమ్మతులు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని అడ్డగోలు అంచనాలతో తమ ఇష్టమైన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం కార్యాలయంగా ముందు హెచ్ సౌత్ బ్లాకును కేటాయించి, దీని మరమ్మతుల కోసం 3.3కోట్లు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కార్యాలయం కోసం 1.5కోట్లు ఉమ్మడి ఖజానా నుండి నిధులు మంజూరు చేస్తూ ఏప్రిల్ 24, 2014న నిర్ణయం తీసుకున్నారు. అన్ని పనులూ పూర్తవుతున్న సమయంలో వాస్తు బాగాలేదని చెప్పడంతో ఎల్ బ్లాకు బాగుంటుందని, అక్కడే మరమ్మతులు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించడంతో మళ్ళీ యుద్ధప్రాతిపదికన 3.3 కోట్లు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంపు కార్యాలయం కోసం కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ మరమ్మతుల కోసం మరో 2.99కోట్లు కేటాయించారు. మరమ్మతులు, ఫర్నిచర్ కోసం కేటాయించిన నిధులన్నీ ఉమ్మడి ఖజానా నుండే ఖర్చుచేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఆర్ధికశాఖ అభ్యంతరం తెలపకుండా ఇష్టారాజ్యంగా నిధులు కేటాయించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన భవనాలను రోడ్లు, భవనాల శాఖ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. వాస్తుదోషం, రక్షణ లేదని ఆంధ్రప్రదేశ్ సీఎం చాంబర్ ను పూర్తిగా మార్చేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రక్షణను ఏమాత్రం పట్టించుకోలేదు. భద్రతలో భాగంగా ఏర్పాటుచేయాల్సిన స్కానర్లను, తెలంగాణ సచివాలయ ప్రధాన ద్వారాన్ని ఇంతవరకూ ఏర్పాటు చేయలేదు.