ఉమ్మడి రాష్ట్రంలో అన్నివిధాల దగాకు గురై, వ్యవసాయం గిట్టుబాటుగాక, కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడుపోతుందో తెలియని దుస్థితిలో మోటార్లు కాలిపోయి, చెరువులు పూడిపోయి, నీరు ఇంకిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలు తెలంగాణ రాష్ట్ర అవతరణతో ఊపిరి పీల్చుకొని, కోలుకొని నడుంబిగించి సాగుకు సిద్ధమయ్యారు. వ్యవసాయం దండగ కాదు, పండగ అని నిరూపించాలని, రైతుమోములో ఆనందం చూడాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తున్నాయి. సాగుకు కావల్సిన ఉత్పాదకాలు అన్నీ సకాలంలో అందిస్తే అధికోత్పత్తి సాధించడంలో తాము ఎవరికీ తీసిపోమని తెలంగాణ రైతన్నలు మరోసారి నిరూపించారు.
ఈ ఏడాది ఖరీఫ్ వరి రైతుకు సిరుల పంట కురిపించింది. 2018-19 ఖరీఫ్ లో ఏకంగా 61 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి వచ్చినట్టు అధికారుల అంచనా. ఇది గత ఏడాది కంటే రెట్టింపు కావడం గమనార్హం. 2017-18 ఖరీఫ్ సీజన్‌లో వరి దిగుబడి 30.42 లక్షల టన్నులుగా ఉంది. ఈ ఏడాది ఖరీఫ్ లో దిగుబడి పెరగడం మాత్రమే కాదు. సాగువిస్తీర్ణం కూడా పెరిగింది. ఖరీఫ్ వరి సాగుచేసే సాధారణ విస్తీర్ణం 23.75 లక్షల ఎకరాలు కాగా, 2018-19 ఖరీఫ్ లో అంచనాలకు మించి 25.44 లక్షల ఎకరాలకు పెరిగింది. ఉత్పాదకత కూడా గణనీయంగా పెరిగింది. సగటున ఎకరాకు 20 క్వింటాళ్ళ ధాన్యం దిగుబడి వచ్చినట్టు అంచనా.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలు, ముఖ్యంగా సాగు పెట్టుబడికోసం ఎకరానికి 8 వేల రూపాయల వంతున అందిస్తున్న రైతుబంధు పథకం, ఉచితంగా నిరంతర విద్యుత్ సరఫరా, మిషన్ కాకతీయ, సాగునీటి పథకాల ద్వారా సాగునీరు లభ్యత పెరగటం, విత్తనాలు, ఎరువులు, తదితరాలను ప్రభుత్వం సకాలంలో అందించడం కూడా ఉత్పాదకత, దిగుబడి పెరగడానికి ప్రధానంగా దోహదం చేసింది.
వీటికి తోడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశాలమేరకు రైతులకు మెరుగైన యాజమాన్య పద్ధతులపై వ్యవసాయాధికారులు, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సిబ్బంది అవగాహన కల్పించడం, వేపపూత యూరియా సరఫరా చేయడం కూడా అధికోత్పత్తి సాధించడానికి దోహదం చేసింది.
ఒక్క మాటలో చెప్పాలంటే రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు నేడు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.
Source: తెలంగాణ మాస పత్రిక