mt_logo

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఓర్వలేకే చంద్రబాబు కక్షసాధింపు – హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తట్టుకోలేక ఈర్ష్యతో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు నష్టం వాటిల్లేలా కుట్రలు చేస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు విద్యుత్ అందకుండా సమస్యలు సృష్టిస్తున్నారని, తెలంగాణ వనరైన బొగ్గుతో ఆంధ్రాప్రాంతంలో విద్యుత్ ను ఉత్పత్తి చేసి తెలంగాణకు దక్కకుండా చూస్తున్నారని అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా నంగునూరు మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన హరీష్ రావు తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడుతున్న చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు.

తెలంగాణలో విద్యుత్ సమస్యలు అధిగమించడానికి సీఎం కేసీఆర్ సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నారని, ఎన్టీపీసీ ద్వారా 4వేల మెగావాట్ల విద్యుత్, సోలార్ ద్వారా మరో వెయ్యి మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 450 మెగావాట్ల విద్యుత్ ను తెలంగాణకు ఇవ్వకపోవడంతో ఇక్కడ విద్యుత్ కోతలు తప్పడంలేదని హరీష్ రావు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కలలుగన్న బంగారు తెలంగాణ సాధించేవరకు విశ్రమించమని, మానిఫెస్టోలో చెప్పినట్లుగా రాష్ట్ర అభివృద్ధికి దశలవారీగా ముందుకు పోతామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *