తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో ఆరుగురు కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. దీనితో ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా మంత్రుల సంఖ్య మొత్తం 18 కి చేరింది. జడ్చర్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్, టీడీపీ నుండి ఇటీవలే టీఆర్ఎస్ పార్టీలో చేరిన తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు.
కొత్తగా ఎన్నికైన మంత్రులకు ఈరోజు సాయంత్రం శాఖలు కేటాయిస్తారని సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్, హోంమంత్రి నాయిని, ఆర్ధికమంత్రి ఈటెల, భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు, అటవీ శాఖామంత్రి జోగురామన్న, పలువురు ఎమ్మెల్యేలు ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు.