నమస్తే తెలంగాణ వ్యవస్థాపక ఎడిటర్, సీనియర్ పాత్రికేయులు అల్లం నారాయణను తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీకి తొలి చైర్మన్ గా నియమిస్తూ ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వెలువడనున్నాయి. మూడు దశాబ్దాలుగా వివిధ పత్రికల్లో పాత్రికేయుడిగా పనిచేసిన అల్లం నారాయణ ప్రస్తుతం నమస్తే తెలంగాణ పత్రికకు ఎడిటర్ గా కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన జర్నలిస్టులను ఉద్యమంలో భాగస్వామ్యుల్ని చేసి తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) ను స్థాపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీజేఎఫ్ ను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ గా మార్చారు.
తెలంగాణకు అనుకూలంగా రాజకీయ శక్తులను సంఘటితం చేయడం, వారితో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం, తెలంగాణ ఆవశ్యకతను, డిమాండ్ ను తెలుపుతూ వివిధ పక్షాల నేతలను ఒప్పించి అందరినీ ఒకే తాటిపైకి తెచ్చారు. ప్రాణహిత శీర్షిక ద్వారా అనేక వందల వ్యాసాలు వ్రాశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మేధావులు, తెలంగాణ జర్నలిస్టులు, తెలంగాణ వాదులు హర్షం వ్యక్తం చేశారు.