శాంతిభద్రతలు రాష్ట్ర సబ్జెక్టు అని, రాష్ట్ర అధికారాలు కేంద్రం చేతిలోకి తీసుకోవడాన్ని తమ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేదిలేదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర హక్కులను హరించాలని చూస్తే ఊరుకోమని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో లేని అంశాలను చేర్చే ప్రయత్నాలను అడ్డుకుంటామని, కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై న్యాయ పోరాటం చేయడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ చెప్పారు.
తెలంగాణ భూములు ఎవరు కబ్జా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని గతంలోనే చెప్పామని, ఏ స్థాయికి చెందినవారైనా అక్రమాలకు పాల్పడితే ఊరుకోమన్నారు. చంద్రబాబు పదేళ్ళపాటు హైదరాబాద్ లో గెస్ట్ మాత్రమేనని, ఆయన ఉమ్మడి సీఎంను అనుకుంటూ భ్రమలో బతుకుతున్నారేమోనని ఎద్దేవా చేశారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి కుట్రలు చేస్తున్నారని, ప్రతి విషయానికి కేంద్రానికి లేఖలు రాయడం సరైన పద్ధతి కాదని అన్నారు.
గురుకుల్ ట్రస్టు భూముల్లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంటే చంద్రబాబు అడ్డుకోవాలని చూస్తున్నారని, దీనిని బట్టి చూస్తుంటే చంద్రబాబు బినామీలెవరైనా ఉన్నారా? అని అనుమానం కలుగుతోందని, అక్రమార్కుల పట్ల రాష్ట్రం వ్యవహరిస్తున్న తీరును అభినందించాల్సింది పోయి ఇలా చేస్తుండటం చూస్తుంటే హైటెక్ సిటీ దగ్గర బాబు బంధువులకు భూములు ఉన్నాయని గతంలో వచ్చిన వార్తలు నిజమేననిపిస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రధాని కూడా గతంలో సీఎంగా పనిచేశారని, ఎవరి అధికారాలు ఏమిటో ఆయనకు తెలుసని, లేఖ రాసిన కేంద్రానికి ధీటైన సమాధానం చెప్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.