తెలంగాణకు రోజుకో అన్యాయం చేస్తూ కేంద్రానికి తప్పుడు లేఖలు రాస్తున్నారని, ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో పర్యటిస్తారని మంత్రి హరీష్ రావు ఏపీ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి హరీష్ మాట్లాడుతూ, ఇప్పటివరకు తెలంగాణకు చేసిన అన్యాయాలు చాలవన్నట్లు మరో కుట్రకు తెరలేపుతున్నారని, నాగార్జునసాగర్ డ్యాంను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నది నేనేనని, జేజేలు కొట్టమంటారా? తెలంగాణకు కరెంట్ రాకుండా అడ్డుకున్నది నేనేనని చెప్తారా? హైదరాబాద్ లో కేంద్రపాలన కావాలని తెలంగాణను అవమానించింది నేనేనని, నా గొప్పతనానికి నీరాజనాలు పలకమని ప్రజలని కోరుతారా? అని హరీష్ రావు నిలదీశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమంపై దృష్టి సారించడంతో టీడీపీ నేతలు భవిష్యత్తుపై దిగులు పెట్టుకున్నారని, మా వల్ల కాదు.. మీరే రావాలంటూ చంద్రబాబును, ఆయన కొడుకు లోకేష్ ను రాష్ట్ర పర్యటనకు ఆహ్వానించడం విచిత్రంగా ఉందన్నారు. నాగార్జునసాగర్ డ్యాంలోని 13 గేట్లను ఆధీనంలోకి తీసుకోవాలని మాచర్ల విద్యుత్ శాఖ ఈఈకి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని, ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు ఎప్పుడు పడితే అప్పుడు నీటి దోపిడీకి పాల్పడ్డారని హరీష్ పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక సాధ్యం కాకపోవడంతో ఏకంగా సాగర్ నే సొంతం చేసుకోవాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
విభజన బిల్లు ప్రకారం నాగార్జునసాగర్ నిర్వహణ తెలంగాణదే.. శ్రీశైలం నిర్వహణను ఏపీ ప్రభుత్వానికి కేటాయించారని, నిర్వహణ రాష్ట్రాల పరిధిలో ఉన్నప్పటికీ, నీటి విడుదల మాత్రం కృష్ణా బోర్డు చూస్తున్నదన్నారు. ఈరోజు కూడా సాగర్ కుడికాల్వ నుండి 3వేల క్యూసెక్కులు, పవర్ హౌస్ ద్వారా 5వేల క్యూసెక్కులు ఆంధ్రాకే పోతున్నాయని, అయినా వాళ్లకు సరిపోవడం లేదని, మన నీళ్ళు కూడా దోచుకోవాలని చంద్రబాబు దురాశకు పోతున్నారని హరీష్ అన్నారు. నిజాలు ఇలా ఉంటే దొంగే దొంగ అన్నట్లుగా బాబు తీరు ఉందని, తెలంగాణ ఇంజినీర్లను ఆంధ్రాలో అడుగుపెట్టడానికి కూడా అనుమతి ఇవ్వట్లేదని, ఆంధ్రా దోపిడీని సాగనివ్వబోమని, ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హరీష్ రావు స్పష్టం చేశారు.