తెలంగాణ ప్రజలను, శాసనసభ్యులను కించపరుస్తూ నీచమైన వార్తాకథనాలు ప్రసరించిన టీవీ9, ఏబీఎన్ ఛానళ్ళపై తెలంగాణ ఎంఎస్‌వోలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలనుండి హైదరాబాద్ మినహా తెలంగాణ తొమ్మిది జిల్లాల్లో ప్రసారాలు ఆపివేసినట్లు తెలంగాణ ఎంఎస్‌వోల అధ్యక్షుడు ఎం. సుభాష్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం జరిగిన అత్యవసర సమావేశంలో ఈ రెండు ఛానళ్ళ ప్రసారాలు నిలిపివేస్తూ ఏకగ్రీవంగా నిర్ణయించారు.
సమావేశం అనంతరం సుభాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల మధ్య చిచ్చురేపే విధంగా కథనాలు ప్రసారం చేస్తున్న ఆంధ్రజ్యోతి ఏబీఎన్, టీవీ9 ప్రసారాలు తెలంగాణ వ్యాప్తంగా నిలిపివేయడం సరైనదేనని, శాసనవ్యవస్థను కించపరచడమంటే తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు. సీమాంధ్ర ఛానళ్ళ వ్యవహారం తెలంగాణ ప్రజల సొమ్ముతిని సీమాంధ్ర నాయకుల పాట పాడుతున్నట్లుగా ఉందని, తెలంగాణ ప్రజలను హీనంగా చూపించే వార్తాకథనాలు ప్రసారం చేస్తే ఏ ఛానల్ ను వదిలిపెట్టమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ పేరుతో కొత్త ఛానళ్ళు అవతరిస్తూ తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని, తెలంగాణ యాస, భాషలకు సాహితీ గౌరవాన్నివ్వాలని సుభాష్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోనూ ఈ రెండు ఛానళ్ళ ప్రసారాలు నిలిపివేయాలని, ప్రసారాలను ఆపకపోతే ప్రజలే వారికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. హైదరాబాద్ పరిధిలో కూడా ప్రసారాలు నిలిపేందుకు సోమవారం సమావేశం కానున్నామని, తాము తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు మద్దతు తెలిపి సహకరించాలని కోరారు.