తెలంగాణ భాష, యాస, సంస్కృతిని అవహేళన చేసే ఛానళ్ళను వదిలిపెట్టమని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఎంఎస్‌వోల సంఘం అధ్యక్షులు సుభాష్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ శాసనసభ, ప్రజలను కించపరిచే విధంగా కథనాలు ప్రసారం చేయడం వల్లే టీవీ9, ఏబీఎన్ ప్రసారాలను హైదరాబాద్ సహా తెలంగాణలోని 9 జిల్లాల్లో ప్రసారాలు నిలిపివేశామని చెప్పారు.
సికింద్రాబాద్ అమృతవాణి భవనంలో జరిగిన తెలంగాణ ఎంఎస్‌వోల సంఘం సమావేశంలో పాల్గొన్న సుభాష్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరిగే సమయంలోనూ సీమాంధ్ర ఛానళ్ళు తప్పుడు కథనాలు ప్రసారం చేశాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా సీమాంధ్ర మీడియాలో ఏ విధమైన మార్పు రాలేదని మండిపడ్డారు. కేబుల్ ఆపరేటర్లు మీడియాలో సగభాగమని, ఈ రెండు ఛానళ్ళ ప్రసారాలను నిలిపివేయాలన్న తమ నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
టీవీ9, ఏబీఎన్ ఛానళ్ళపై చర్యలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కమిటీ వేయడాన్ని తాము సమర్ధిస్తున్నామని, తెలంగాణకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేస్తే ఏ ఛానల్ కైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ఈ రెండు ఛానళ్ళ యజమానులు తమ సంఘంతో చర్చించే వరకు ప్రసారాలు నిలిపేస్తామని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, కేబుల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, నల్గొండ జిల్లా ఎంఎస్‌వోల సంఘం అధ్యక్షుడు ఏసూరి భాస్కర్, ఎంఎస్‌వోల సంఘం మాజీ అధ్యక్షుడు కుల్దీప్ సహాని తదితరులు పాల్గొన్నారు.