mt_logo

కౄర నిర్బంధంపై తెలంగాణ ప్రజల విజయం

[మార్చి 10 , 2011 నాడు పోలీసు బ్యారీకేడ్లను బద్దలుకొట్టి లక్షమంది తెలంగాణ ప్రజలు ట్యాంక్ బండ్ పై కదనకవాతు నిర్వహించారు. ఆనాటి అనుభవాలను మిలియన్ మార్చ్ లో ప్రత్యక్షంగా పాల్గొన్న కొణతం దిలీప్ మాటల్లో విందాం.]

మిలియన్ మార్చ్ కాస్తా 4 గంటల ర్యాలీగా మారినప్పుడు అందరు తెలంగాణవాదుల్లాగే నేనూ నిరాశ చెందాను. కానీ దాన్ని మొత్తానికి వాయిదా వేయడం కంటే ఏదో ఒక రూపంలో కొనసాగించడమే మేలని సరిపెట్టుకున్నాను.

తొలుత మిలియన్ మార్చ్ ను చాలా భారీ ఎత్తున జరపాలనేది తెలంగాణ జేయేసీ వ్యూహం. అయితే మార్చ్ 10 న జరగవలసిన ఇంటర్ మీడియట్ పరీక్షను వాయిదా వేస్తామని మాట ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ తరువాత తెర వెనుక ఏ శక్తులు పనిచేశాయో గానీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చుంది. దీంతో మిలియన్ మార్చ్ ను కొంచెం వెనకకు జరుపుదామని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిపాదించింది. అయితే జేయేసీలోని బీజేపీ, సీ.పీ.ఐ. ఎం.ఎల్, ఇతర ఉద్యోగ, ప్రజా సంఘాలు మాత్రం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవద్దని గట్టిగా పట్టుబట్టాయి. దీనితో ప్రొ. కోదండరాం ఆధ్వర్యంలో జేయేసి ఒక రోజంతా చర్చించి చివరికి మధ్యేమార్గంగా మిలియన్ మార్చ్ ను ఒక ర్యాలీ రూపంలో జరపాలని నిర్ణయించాయి.

రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉద్యమకారులు చూపించిన విజ్ఞతలో వందోవంతు కూడా చూపలేకపోయింది.

మార్చ్ 9 నాడు ఉదయం వరంగల్ నుండి మిత్రుడు రాకేశ్ ఫోన్ చేశాడు. అక్కడ 24 గంటలుగా యుద్ధ వాతావరణం నెలకొన్నదని, పోలీసులు ఎవరినీ హైదరాబాద్ కు వెళ్లనివ్వడం లేదని చెప్పాడు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లలో పోలీసులు క్యాంపు పెట్టారట. 30 యేళ్ల లోపు ఉన్న యువతీ యువకులను ఎవరినీ హైదరాబాద్ వెళ్లే బస్సు కానీ, రైలు కానీ ఎక్కనివ్వడం లేదట. ఈపాటికే జేయేసీ, టీఆరెస్, బీజేపీ నాయకులను అరెస్టు చేశారట. తను కూడా హైదరాబాదుకు రాలేకపోవచ్చని రాకేశ్ చెబుతుంటే అసలు ఇది ప్రజాస్వ్యామ్యమేనా అని ఆవేదన కలిగింది.

నల్లగొండలో ఉన్న మా బంధువులకు ఫోన్ చేస్తే అదే పరిస్థితి. సూర్యాపేట, నకిరేకల్, నార్కట్ పల్లి, చౌటుప్పల్ ఇలా హైవే పై డజన్ల కొద్దీ చెక్ పోస్టులు. చౌటుప్పల్ దగ్గరలోని ఒక పల్లెటూళ్లో టీచర్ గా పని చేస్తున్న మా బంధువు, మరునాటి ర్యాలీకి ఎలాగైనా తమ స్కూలు స్టాఫ్ అంతా వస్తామని చెప్పడం సంతోషం కలిగించింది.

యాదగిరిగుట్ట దగ్గరలో ఒక గ్రామంలోని స్కూళ్లో పని చేసే మిత్రునికి ఫోన్ చేస్తే తను కూడా మిత్ర బృందంతో కలిసి వస్తానని. ట్యాంక్ బండ్ దాకా రానివ్వకపోతే కనీసం తార్నాక వరకన్నా వచ్చి ప్రతిజ్ఞ చేసి వెళతామని ఆ మిత్రుడు చెప్పాడు.

మధ్యాహ్నం వరకే 10 తెలంగాణ జిల్లాల్లో పోలీసుల నిర్బంధం తీవ్రమైంది. మొత్తం తెలంగాణలో 1,00,000 మంది ప్రజలను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటే ఒక్క హైదరాబాదులోనే 11,000 మందిని అరెస్టు చేశారంటే ఈ ప్రభుత్వం ఉద్యమంపై ఎంతటి నిర్బంధం అమలు చేస్తుందో అర్థం అవుతుంది.

టీవిలో ఒక ఎస్పీగారు ర్యాలీకి ప్రజలెవరూ పోకుండా తాము ఎలాంటి చర్యలు చేపడుతున్నామో గొప్పగా సెలవిస్తున్నారు. జిల్లాలో ఉన్న ప్రైవేటు వాహనాల యజమానులందర్నీ ర్యాలీకి వాహనాలు పంపొద్దని హెచ్చరించడం, స్కూలు కాలేజీ యాజమాన్యాలను కూడా ర్యాలీకి తమ వాహనాలు ఇవ్వొద్దని హెచ్చరించడం, విద్యార్ధుల తల్లి తండ్రుల వద్దకు వెళ్లి మీ పిల్లలు ర్యాలీకి వెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం, ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న వారిని అదుపులోకి తీసుకోవడం, బైండోవర్ చేయడం…

ఇవీ ఒక ప్రజాస్వ్యామ్య దేశంలో ప్రజలకున్న హక్కులు!

సాయంత్రం నగర కమీషనర్ గారు సిటీలో ఎన్ని రోడ్లు మూసేస్తున్నామో లిస్టు చదివారు. ప్రజలకు, ట్రాఫిక్ కు అసౌకర్యం కలుగుతుందనే ర్యాలీకి అనుమతి నిరాకరించారట. ఇన్ని రోడ్లు ముళ్ల కంచెలతో, బ్యారీకేడ్లతో మూసేస్తే ప్రజలకు అసౌకర్యం కలగదేమో మరి.

ఇవన్నీ చూస్తుంటే ఒకవైపు ఆగ్రహం కలుగుతోంది. ఈజిప్టులో, ట్యునీషియాలో నియంతలకు వ్యతిరేకంగా ఆయా రాజధాని నగరాల్లో లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలియపరచగలిగారు. కానీ తెలంగాణలో మాత్రం ఒక ప్రజా ఉద్యమంపై ఇంతటి నిర్బంధం.

10 మార్చ్ ఉదయం మిత్రులతో ఫోన్లో మాట్లాడుతుంటే అందరి మదిలోనూ ట్యాంక్ బండ్ దాకా వెళ్లగలమా లేదా అనే అనుమానమే. సరే, ప్రయత్నమైతే చేద్దాం ఎక్కడ ఆపితే అక్కడ “జై తెలంగాణ” నినాదాలు చేసి “తెలంగాణ ప్రతిజ్ఞ” చేసి వద్దాం అనుకున్నాం.

ముందే స్వర్ణ కూడా వస్తానని చెప్పడంతో మా బాబును అక్క వాళ్ళింటికి పంపించాం. ముందు రోజే ఒక మిత్రునితో ఒక జాతీయ జెండా, ఎండకు రక్షణలా ఉంటాయని కొన్నీ టోపీలు తెప్పించాను.

ఉదయం నుండీ బారికేడ్లను ఛే దించుకుని ట్యాంక్ బండ్ సమీపం దాకా వచ్చిన ప్రజలను అరెస్టు చేస్తూనే ఉన్నారు పోలీసులు.

తెలంగాణ అకాడమీ ఆఫ్ ఎక్స్ లెన్స్ సంస్థకు చెందిన శశి అర్జుల ఫోన్ చేశాడు, తాము ఖైరతాబాద్ వైపు నుండి వస్తున్నామని. ఇంతలో సూరేపల్లి సుజాత ఫోన్ చేసింది ఎలా వెళ్తున్నారని. మేము నల్లకుంటకు వస్తున్నామని, తనని కూడా అక్కడికే రమ్మని చెప్పాను.

నల్లకుంటలో ఇంకొందరు మిత్రులను కలిసి ఎలా వెళ్దామని అలోచిస్తుండగా తెలంగాణ ఆత్మ గౌరవ వేదికకు చెందిన బాల్ రెడ్డి గారు ఫోన్ చేశారు దోమల్ గుడా మీదుగా అయితే ట్యాంక్ బండ్ సులభంగా చేరుకోవచ్చని.

సరేనని ఏ.వి. కాలేజి పక్క సందుగుండా లోవర్ ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నాం. అప్పటికే అక్కడ బారీకేడ్లను విరగ్గొట్టారు. ట్యాంక్ బండ్ కు ఉన్న మెట్ల దారి గుండా పరుగు పరుగున పైకి వెళ్లి చూస్తే నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. రెండు వైపుల నుండీ ట్యాంక్ బాండ్ పైకి “జై తెలంగాణ” నినాదాలతో కదం తొక్కుతూ వస్తున్న వేలాది మంది ప్రజలు.

ఎంతటి మహత్తర ఘడియలవి!

తెలంగాణ మొత్తాన్నీ ఒక బందీఖానాగా మార్చి ర్యాలీ ఎలా జరుగుతుందో చూస్తాం అని సవాలు విసిరిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర డిజీపీకి గూబ గుయ్యిమనిపించారు నా తెలంగాణ ప్రజలు.

అదిగో ఉద్యమానికి వేగుచుక్కలు ఉస్మానియా వీరులు. ఆ వెనకే వస్తున్నది న్యాయపోరాటానికి తమ వంతు సహకారం అందిస్తున్న న్యాయవాదులు. కాస్త వెనక భారతీయ జనతా పార్టీ జెండాల రెప రెపలు. కుడి వైపు నుంచి కదం తొక్కుతూ వస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు.

వెంటనే ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్న ఆప్త మిత్రులకు ఫోన్ చేసి ఈ శుభవార్తను పంచుకున్నాను.

స్వర్ణ, నేను ట్యాంక్ బండ్ ప్రధాన ద్వారం వైపు నడిచాం. ఎదురుగా పరుగున వస్తున్న వేణు కనిపించాడు. ఒక పక్కన ఇద్దరు చిన్న పిల్లలతో ర్యాలీకి వచ్చిన సృజన కనపడింది. స్వర్ణను అక్కడే నిలబడమని చెప్పి నేనూ, వేణు ట్యాంక్ బండ్ మరో వైపుకు నడక సాగించాం. మా ఎదురుగా అలలు అలలుగా వస్తున్న తెలంగాణ ప్రజలు.

తెలంగాణ డాక్టర్ల జేయేసి, సింగరేణి మైన్స్ కార్మికులు, విద్యుత్ ఉద్యోగుల జేయేసి, లెక్చరర్ల జేయేసి, ఉపాధ్యాయ సంఘాలు…

అదిగో ఉస్మానియా చెల్లెమ్మలు మణి, బాల లక్ష్మి.

పక్కనే తన పాటలతో హుషారెత్తించేది నేర్ణాల కిషోర్ కదూ! నా ఎదురుగా వస్తున్నది అరుణోదయ రామారావుగారు…
లాన్స్ పక్కన బ్యానర్ చేతబట్టి నిలబడ్డారు సింగిడి తెలంగాణ రచయితలు. ఇంకొంచెం ముందు లాన్స్ లో కూర్చుని జనాలను చూస్తున్నారు మంజీర రచయితల సంఘానికి చెందిన నందిని సిధారెడ్డి గారు.

ఇంతలో గద్దర్ రానే వచ్చాడు. ఆయన వెంట ప్రజలు ఉరుకులు పరుగులు పెట్టారు.

ఎండలో నిలబడ్డ సియాసత్ ఎడిటర్ జాహెద్ అలీ ఖాన్ సాబ్ తో వేణు కరచాలనం చేశాడు. దేశంలో అత్యధిక సర్క్యులేషన్ గల ఉర్దూ పత్రిక సియాసత్.

ఎదురుగా గుంపులు గుంపులుగా వస్తున్న ఏబీవీపీ, పీ.డీ.ఎస్.యూ విద్యార్ధులు. వారికి ఎదురుగా ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ (IFTU) సభ్యులు వస్తున్నారు.

మూవ్ మెంట్ ఫర్ పీస్ ఎండ్ జస్టిస్ (MPJ) సంస్థనుండి ముస్లింలు భారీగా తరలి వచ్చారు. “ఔర్ ఏక్ ధక్కా తెలంగాణ పక్కా” అంటూ వారు నినాదాలు చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తున్న మిత్రురాలు సూరేపల్లి సుజాత కలిసింది.

చాలా మంది ఏ సంఘాలకు, పార్టీలకు చెందని సామాన్య హైదరాబాదీ ప్రజలే ఉన్నారు. ఎంతో కాలంగా హైదరాబాదులో తమ సత్తా ఏమిటో చూపెట్టాలనే తెలంగాణవాదుల పట్టుదల, పోలీసుల నిర్బంధంవల్ల రెట్టింపైంది. ప్రతీ ఒక్కరూ ఇవ్వాళ ఏదో ఒకటి తేలిపోవాల్సిందే అనే తెగింపుతో వచ్చారు.

ఇంతలో ప్రజాతంత్ర పబ్లికేషన్స్ దేవులపల్లి అజయ్ గారు కలిసారు. పాపం ఆయన ఈ మధ్యనే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసులు విసిరిన రాయి తగిలి తీవ్రంగా గాయపడి కోలుకుంటున్నారు. అయినా ఓపికచేసుకుని ఇక్కడికి వచ్చారు.

ఒక పక్క మీడియా వారితో మాట్లాడుతూ చుక్కా రామయ్య గారు కనపడ్డారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే పోలీసులు అడ్డుకున్నా ఆగక తన అనుచరులతో వస్తున్న విమలక్క కనపడింది.

ఇంకో పక్క లాన్స్ లో ఉద్యమ గీతాలాలపిస్తున్న మాభూమి సంధ్యక్క కనపడితే వేణు, నేను వెళ్లి షేక్ హాండిచ్చి వచ్చాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పోలీసులు అడ్డుకోబోగా చాకచక్యంగా వారిని తప్పించుకుని పరుగు పరుగున ట్యాంక్ బండ్ చేరుకున్నారు. రెండున్నర అవుతుండగా ప్రొఫెసర్ కోదండరాం ను పోలీసులు అరెస్టు చేశారని తెలిసింది.

ట్యాంక్ బండ్ పై అనేక బెటాలియన్ల రాపిడ్ ఆక్షన్ ఫోర్స్ పోలీసులు ఆటోమేటిక్ తుపాకులు చేబూని కనపడ్డారు.
మేము ఆ చివర వరకూ వెళ్ళి తిరిగి వస్తుంటే అకస్మాత్తుగా ఒక చోట కలకలం రేగింది. ఏమైందని పరుగున వెళ్లి చూస్తే అక్కడ ఒక ఉస్మానియా విద్యార్ధి విషం తాగి పడిపోవడం, అక్కడున్నవారు ఆ యువకుడిని వెంటనే ఒక అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించడం కనిపించింది. ఆ యువకుడు చేతిలో ఉన్న తన సూసైడ్ నోట్ కాపీలు అక్కడున్న ఇద్దరు ముగ్గురికి ఇచ్చాడట. ఒక విశాలాంధ్ర విలేకరి మాకు ఆ నోట్ చూపించాడు. అది చదువుతుంటే హృదయం ద్రవించిపోయింది నాకు. సంపత్ నాయక్ అనే ఆ యువకుడు ఆ ఉత్తరంలో కేంద్ర, రాష్ట్ర రాజకీయ నాయకులను తీవ్రంగా విమర్శించాడు. ఈ రోజు జరిగిన మూడో ఆత్మహత్యయత్నం ఇది. పొద్దున ఖమ్మంలో ఒక యువకుడు ప్రాణాలు తీసుకోగా, బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ ముందు మరో యువకుడు ఆత్మాహుతికి ప్రయత్నించాడు.

ఆ సంఘటన ట్యాంక్ బండ్ పై చేరిన అనేక మందిని కలచివేసింది. పోలీసు వలయాలను చేధించి విజయం సాధించామన్న సంతోషం ఆవిరయ్యి దాని స్థానంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొంతమంది యువకులు కంటికి కనపడ్డ దాన్నల్లా ధ్వంసం చేయడం మొదలు పెట్టారు. పోలీసు జీపు ఒకటి అగ్నికి ఆహుతయ్యింది. కొన్ని హోర్డింగులు నేల కూలాయి. ఆంధ్రా ఆధిపత్య సంస్కృతికి చిహ్నాలుగా ట్యాంక్ బండ్ పైనున్న విగ్రహాలను కొంతమంది యువకులు కూల్చేశారు. అప్పుడే అటుగా వచ్చిన కాంగ్రెస్ ఎంపీలు కేకే, మధుయాష్కీలపై కొందరు యువకులు చేయి చేసుకున్నారట.

సాయంత్రం కేసీయార్ వచ్చేసరికి ట్యాంక్ బండ్ పై పూర్తి ఉద్రిక్తత నెలకొన్నది. ఆయన పోతన విగ్రహం వద్దకు నేరుగా వెళ్లి తెలంగాణ ప్రతిజ్ఞ చేయించారు.

సాయంత్రం అయిదున్నర ప్రాంతంలో మేము అక్కడినుండి బయలుదేరాము.

మలి దశ ఉద్యమంలో మిలియన్ మార్చ్ ఒక మైలు రాయి. తెలంగాణలో వేలాదిగా CRPF, CISF, RAF, ITBP, APSP, BSF వంటి పారామిలిటరీ బలగాలను దింపి ఉద్యమాన్ని అణచివేయొచ్చని కలలుగన్న ముఖ్యమంత్రి, డిజీపీ, గవర్నర్ లకు ఈ మార్చ్ ఒక చెంప పెట్టు లాంటిది.

ఇక ఈ ప్రజా ఉద్యమ విజయాన్ని ఆపే శక్తి ఏ ప్రభుత్వానికీ లేదు.

By: కొణతం దిలీప్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *