By: Katta Sekhar Reddy
సీమాంధ్ర ఆధిపత్యానికి అవశేషంగా మిగిలే తెలుగుదేశంను మాత్రం తెలంగాణ ఇంకెప్పుడూ జీర్ణించుకునే అవకాశాలు లేవు. హైదరాబాద్‌లో వలస ఓట్లతో ఎప్పుడయినా రెండు మూడు సీట్లు దక్కించుకోగలదేమో కానీ, తెలంగాణ గడ్డమీద మాత్రం ఆ పార్టీకి అంత్యక్రియలు జరిగినట్టే.
తెలంగాణ రాష్ట్రంలో ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు అన్నది అర్థం చేసుకోవడానికి వేరే కొలమానాలు అక్కరలేదు. రేవంత్‌రెడ్డి తప్పు పడుతున్నాడూ అంటే అది ఖచ్చితంగా ఒప్పయి ఉంటుంది. రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడూ అంటే చంద్రబాబు మాట్లాడుతున్నాడని అర్థం. చంద్రబాబు తెలంగాణకు ఏది అవసరమో అది మాట్లాడడు కదా? తెలంగాణకు ఏది మంచో అది చెప్పడు కదా? ఆ పత్రికలు, ఆ చానెళ్లు ఏడుస్తున్నాయీ అంటే అదేదో తెలంగాణకు శుభం జరిగినట్టే. శనివారం పొద్దుటే ఫోనులో ఒక రాజకీయ బుద్ధిజీవి విశ్లేషణ ఇది. రాజకీయాల్లో కొన్ని ప్రతీకలు అలా ఏర్పడతాయి. గతంలో మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడితే తెలంగాణలో అలాగే అనుకునేవారు. అన్నా ఎన్ని ఫోన్లు వస్తున్నాయో తెలుసా అని ఒకసారి తెగ ఆనందపడిపోయారు మోత్కుపల్లి. అవును కేసీఆర్‌ను తిట్టేవాడు కేబీఆర్ పార్క్ వాకర్లలో హీరో అప్పట్లో. కానీ తెలంగాణ ప్రజల మనసు వేరుకదా. పాపం మోత్కుపల్లి రాజకీయంగా దెబ్బతినిపోయారు. కొడంగల్ నియోజకవర్గం ప్రధాన స్రవంతిలో లేకపోవడం వల్ల రేవంత్‌రెడ్డి బతికిపోయాడు.
నేడు మాట్లాడగలుగుతున్నాడు. మోత్కుపల్లి స్థానాన్ని ఆయన తీసుకున్నట్టున్నారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు సహజంగానే రేవంత్‌రెడ్డి వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని ఆయన లక్ష్యమట అని తెలుగుదేశం వ్యవహారాలు చూసే ఒక సీనియర్ జర్నలిస్టు చెప్పారు. పాపము శమించుగాక. మంచి చేసి నాయకుడు కావచ్చు. కానీ చెడు చేసి, చెడు మాట్లాడి, చెడు పక్షం వహించి నాయకుడు కావడం చరిత్రలో జరుగలేదు. అలా జరిగితే ఆ రాష్ట్రం కొసెల్లదు. అసలు ఆయన గురించి ఇంత టాపిక్ అవసరమా అని వాకింగ్ మిత్రుడు నిలదీశాడు. ఆయన గురించి ఇంతగా మాట్లాడుతున్నారూ అంటే ఆయన విజయం సాధించినట్టే కదా అని మరో లాజిక్కు తీశాడు మిత్రుడు. నిజమే…కానీ వందసార్లు చెబితే అబద్ధం నిజమవుతుందని నమ్మే రాజకీయ సంతతిని ప్రస్తావించకుండా సమాధానం చెప్పలేం. మెట్రో గురించి, ఆ తర్వాత మైహోం గురించి చేస్తున్న ప్రచారం చూస్తే ఖచ్చితంగా ఇందులోని కుట్రకోణం బయటపడుతుంది. తొలి తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి చంద్రబాబు, ఆయన ఏజెంట్లు ఎంతగా కాచుకుని కూర్చున్నారో ఈ పరిణామాలు చెప్పకనే చెబుతాయి.
చంద్రబాబు, ఆయన పంజరంలోని చిలుక రేవంత్‌రెడ్డి తెలంగాణకు ఎల్‌అండ్‌టీకి పంచాయితీ వస్తే ఎల్‌అండ్‌టీ పక్షం వహిస్తాడు. ఎల్‌అండ్‌టీకి మై హోంకు పంచాయితీ వస్తే ఎల్‌అండ్‌టీ పక్షం వహిస్తాడు. మై హోంకు గేమింగ్ సిటీకి పంచాయితీ వహిస్తే గేమింగ్ సిటీ పక్షం వహిస్తాడు. రేవంత్‌రెడ్డి ఇక నుంచి ఏ అంశంలోనయినా ఎవరి పక్షం వహిస్తాడో వేరే చెప్పనవసరం లేదు.
ఎవరు ఏపక్షం వహించినా సత్యం సమాధి కాకూడదు కదా. మై హోం ఏపీఐఐసీ వద్ద భూమిని వేలం పాడి తీసుకుంది నిజం కాదా. మొత్తం భూమికి డబ్బులు చెల్లించింది నిజం కాదా? ఆ భూమిని మై హోంకు అందించాల్సిన బాధ్యత ఏపీఐఐసికి లేదా? అది అమలయ్యేట్టు చూడాల్సిన బాధ్యత వేలం డబ్బులను పూర్తిగా రంగరించి మింగేసిన ప్రభుత్వానికి లేదా? భూవివాదాలు ఏమి తలెత్తినా పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వానిది, ఏపీఐఐసీది కాదా? గేమింగ్ సిటీ ప్రారంభోత్సవానికి వెళ్లిన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సాక్షిగా మంత్రి పొన్నాలను యూ ఛీటర్స్ అని అంత పెద్ద సభలోనే నిలదీయడానికి ఎంతటి దమ్ము ఉండాలి. మైం హోం రామేశ్వర్‌రావుకు దమ్ము, ధైర్యం ఉన్న మనిషిగా పేరు ఉంది. ఆయన దైవభక్తి పరాయణుడు. అనేక ఆధ్యాత్మిక, సామాజిక స్వచ్ఛంద సేవా కార్యకలాపాల్లో పాల్గొంటారు. తెలుగుదేశంను మోస్తున్న పారిశ్రామికవేత్తల్లా కొండలను, గోలకొండలను మింగేసేరకం కాదు. ఆయనపై ఇంతవరకు ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆరోపణలు లేవు. రేవంత్‌రెడ్డి మోకాలు బోడిగుండు మాత్రమే కాదు చిటికన వేలు కూడా ముడేయాలని తాపత్రయ పడుతున్నాడు. తిమ్మినిబమ్మి, బమ్మినితిమ్మి చేయాలని చూస్తున్నాడు.
ఆయన మాటకారితనం ఇలా ఉపయోగపడుతున్నది. తెలంగాణకు వ్యతిరేక అద్దె మైకులుగా స్థిరపడిన కొన్ని చానెళ్లు రేవంత్‌రెడ్డి నోటికి గొట్టాలు తగిలించి గంటలు గంటలు వదిలేశాయి. పర్వాలేదు. మళ్లీ అదే మాట. ఆయన ఎందుకు మాట్లాడతాడో, ఆ మీడియా ఎందుకు ప్రచారం చేస్తుందో అర్థం చేసుకునే శక్తి తెలంగాణ సమాజానికి ఉంది.
చంద్రబాబునాయుడు ఎల్‌అండ్‌టీకి సర్టిఫికెట్ ఇస్తున్నాడు. అది ప్రొఫెషనల్ సంస్థ అట. ఆ వివాదంలోకి తనను లాగొద్దట. ఎల్‌అండ్‌టీకీ రాజకీయాలు లేవట. నిజమే ఎల్‌అండ్‌టీ ప్రొఫెషనల్స్ నడుపుతున్న సంస్థ. దాని పనితనంపై అందరికీ గౌరవం ఉంది. అది సాధించిన విజయాలు అమోఘం. మెట్రోను నిర్మిస్తున్న తీరు కూడా మంచి ప్రశంసలు పొందుతున్నది. కానీ ఎల్‌అండ్‌టీ రాజకీయాలకు అతీతం కాదు. తెలంగాణ రావాలో వద్దో, వస్తే మంచో చెడో ఆలోచించేవాడు రాజకీయాలకు అతీతమైనవాడు ఎలా అవుతాడు.
తెలంగాణ వచ్చింది కాబట్టి, మాకు లాభాలు రాకపోవచ్చని ఇప్పుడు ఎగనామం పెడదామని ఆలోచించే సంస్థ నిజాయితీని శంకించకుండా ఎలా ఉండడం? ముందున్న ప్రభుత్వాలు తెలంగాణ రాదని చెప్పి ఒప్పందంపై ఏమైనా సంతకాలు పెట్టించాయా? హైదరాబాద్‌లో మెట్రో లాభసాటి కాదని మెట్రో ఏదైనా అధ్యయనం చేయించిందా? ఏవైనా నివేదికలు రూపొందించిందా? వాటన్నింటినీ బహిర్గతం చేయండి లేకపోతే ఎవరిని మెప్పించడానికి ఈ లేఖలు రాస్తున్నది. కాంట్రాక్టు సంస్థలు ఇంత పెద్ద నిర్ణయాలను ఇంత తేలికగా ఎలా తీసుకోగలుగుతున్నాయి? ఎవరి ధైర్యం చూసుకుని ఇటువంటి దోబూచులాటలు ఆడుతున్నాయి? సచివాలయంలో డీ బ్లాక్ నిర్మాణం సందర్భంగా కాగ్ కూడా ఎల్‌అండ్‌టీని తప్పుపట్టింది. ఎల్‌అండ్‌టీకి అక్రమ చెల్లింపులు జరిగాయని విమర్శలు వచ్చాయి. డీ బ్లాక్ చెల్లింపులకు ప్రతిగా ఎల్‌అండ్‌టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నిర్మించిందని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి. మెట్రో ప్రాజెక్టును రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా మార్చారని, దారిపొడవునా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల సంతర్పణ జరుగుతున్నదని స్వచ్ఛంద సంస్థలు చాలాకాలంగా విమర్శిస్తున్నాయి. ముందు అంగీకరించిన దానికంటే ఆ తర్వాత చాలా డిమాండ్లు పెంచుతూ పోయిందని విమర్శలు వచ్చాయి. ఫిర్యాదులు ఉంటే ఎల్‌అండ్‌టీ ప్రభుత్వానికి లేఖలు రాయడంలో తప్పు లేదు. ఏ రాజకీయాలూ లేకపోతే ఆ లేఖలు ఆ రెండు పత్రికలకు ఎందుకు దక్కుతాయి? ఎల్‌అండ్‌టీ వ్యాపారం చేస్తున్నదా? రాజకీయాలు చేస్తున్నదా? అన్న ప్రశ్నలు తలెత్తడం అందుకే.
తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి, ఒక రకంగా రాజకీయాలు చేసి లబ్ధిపొందుదామని చూసినట్టు అర్థమవుతున్నది. కానీ ఎల్‌అండ్‌టీ మిత్రపూర్వకంగా సాధించదల్చుకుందా? లేక ఘర్షణ పడదల్చుకుందా అన్నది తేల్చుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ఘర్షణ వైఖరిని సహజంగానే దీటుగా తిప్పికొట్టింది. సీమాంధ్ర పత్రికలు, తెలుగుదేశం ఇచ్చే సర్టిఫికెట్లు ఏవీ తెలంగాణలో చెల్లవని ఎవరయినా గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకుల్లో, అధికారుల్లో చంద్రబాబు ఆర్డర్లు పాటించే శక్తులు ఉండవచ్చు. కానీ ప్రజల్లో ఉండబోరని ఇప్పటికే రుజువయింది. బీజేపీ, కాంగ్రెస్‌లను తెలంగాణ ప్రజలు సహిస్తారు. అవి కూడా స్వతంత్రంగా వ్యవహరించగలిగితేనే. కానీ సీమాంధ్ర ఆధిపత్యానికి అవశేషంగా మిగిలే తెలుగుదేశంను మాత్రం తెలంగాణ ఇంకెప్పుడూ జీర్ణించుకునే అవకాశాలు లేవు. హైదరాబాద్‌లో వలస ఓట్లతో ఎప్పుడయినా రెండు మూడు సీట్లు దక్కించుకోగలదేమో కానీ, తెలంగాణ గడ్డమీద మాత్రం ఆ పార్టీకి అంత్యక్రియలు జరిగినట్టే. రేవంత్‌రెడ్డి కాదు కదా స్వయంగా చంద్రబాబే ఇక్కడికొచ్చి నిలబడినా తెలంగాణ ప్రజలు మన్నించే అవకాశం లేదు.
[నమస్తే తెలంగాణ]
