తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన పుష్కరాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. 144 ఏళ్లకొకసారి వచ్చే మహాపుష్కరాలు కావడంతో తెలంగాణ ప్రజలంతా గోదావరి ఒడ్డుకు చేరారు. తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షలమంది పుష్కర స్నానాలు చేసి వారి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం గం. 6.26 ని.లకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సతీసమేతంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో పుష్కరస్నానం చేసి లాంఛనంగా పుష్కరాలు ప్రారంభించారు. సీఎంతో పాటు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి తదితరులు పుణ్యస్నానాలు చేశారు. భద్రాచలం, బాసర, ధర్మపురి, కాళేశ్వరంలలో తొలిరోజు రాత్రి 9 గంటల సమయానికి 11 లక్షల మందికిపైగా భక్తులు పవిత్ర స్నానాలు చేశారని తెలిసింది. ప్రారంభం రోజునే ఇంతమంది ఉంటే మరో 11 రోజులపాటు జరగనున్న పుష్కరాలకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లను మెరుగుపరచాలని సీఎం ఆదేశించారు.
భద్రాచలంలో త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి సారథ్యంలో పుష్కరాలు ప్రారంభం కాగానే మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, మైహోం సీఎండీ జూపల్లి రామేశ్వరరావు తదితరులు పుష్కర స్నానాలు చేశారు. భద్రాచలం పుష్కర ఘాట్ లను రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ పర్యవేక్షించారు. భద్రాచలంలో ఒక్కొక్క ఘాట్ ఒక కిలోమీటర్ వరకు పొడవు ఉండటంతో ఒకేసారి 25 వేలమంది స్నానం చేసే వీలున్నాడని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాయలసీమ, కోస్తా ప్రాంతం నుండి జనం ఎక్కువగా వచ్చారని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు వరంగల్ లోని మంగపేటలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ సీతారాం నాయక్, సమాచార శాఖ కమిషనర్ బీపీ ఆచార్య తదితరులు పుష్కర స్నానం చేశారు. వరంగల్ లో మూడు స్నానఘట్టాలలో కలిపి మొత్తం 3 లక్షలమంది స్నానాలు చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 11 ప్రాంతాల్లో 18 స్నానఘట్టాలను ఏర్పాటు చేశారు. మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కవిత ఇక్కడ పుష్కరాలు ప్రారంభించారు. సాయంత్రం కల్లా లక్షా 80 వేలమంది పుణ్యస్నానాలు చేశారు. బాసరలో లక్షా 50 వేలమంది పుష్కర స్నానాలు చేశారు. కాళేశ్వరంలో 2 లక్షలమంది భక్తులు, ధర్మపురిలో 2 లక్షలమంది భక్తులు, కరీంనగర్ లో 6 లక్షల 50 వేలమంది భక్తులు పుష్కర స్నానం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ఉదయం ప్రారంభించిన గోదావరి నది పుష్కరాలు సాయంత్రం ఆరుగంటల వరకు కొనసాగాయి. ఏడుగంటల ప్రాంతంలో వేదపండితులు గోదావరి నది ఒడ్డుకు చేరుకొని తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మహాహారతిని పట్టారు. దీంతో మొదటిరోజు పుష్కరాలు ముగిశాయి. తిరిగి బుధవారం ఉదయం 6.30 గంటలకు రెండవరోజు పుష్కరాలు ప్రారంభం అవుతాయి.