పాలమూరు పథకాన్ని అడ్డుకోవడానికి ఎవరెన్ని ప్రయత్నాలు చేస్తున్నా లెక్కచేయకుండా ముందుకు సాగిపోవాలని తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. రాష్ట్రం వచ్చాక ఎవరడ్డొచ్చినా సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి తీరుతానని, అవసరమైతే అక్కడే కుర్చీ వేసుకుని మరీ పనులు చేయిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కృష్ణా జలాల్లో ఇన్నాళ్ళ దోపిడీకి అడ్డుకట్ట వేసి బొట్టుబొట్టు లెక్కవేసి తెలంగాణ వాటా పూర్తిగా వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచన. ఈ పథకానికి ఈనెల 11న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం నివారించేందుకు ప్రత్యేకంగా ఆఫీసర్-ఆన్-స్పెషల్ డ్యూటీగా రంగారెడ్డిని నియమించారు.
ఏపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పనులు మాత్రం యథావిధిగా సాగుతూనే ఉన్నాయి. పథకంలో భాగంగా చేపట్టబోయే నార్లాపురం రిజర్వాయర్ కు వచ్చేనెల టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ లలో టెండర్లు పిలిచి ఆ ప్రక్రియ అక్టోబర్ లో పూర్తిచేసి నవంబర్ లో పథకం పనులు మొదలుపెట్టాలని అధికారుల యోచన. శ్రీశైలం నుండి నీటిని సేకరించిన తర్వాత నిర్మించే టన్నెల్ ద్వారా మొదట నార్లాపురం రిజర్వాయర్ కే తరలిస్తారు. సుమారు 6 టీఎంసీల సామర్ధ్యం ఉండే ఈ రిజర్వాయర్ నిర్మాణానికి రూ. 600-700 కోట్లు ఖర్చవుతాయని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు ఈ పథకంలో భాగంగా భూసేకరణ ప్రక్రియకు ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తున్నది. భూసేకరణ చట్టం జోలికి పోకుండా రైతులతో నేరుగా మాట్లాడి వారికి అనుకూలంగానే భూమి సేకరించాలని, భూమిని కోల్పోయిన వారికి వాటి విలువ మీద ఒక రూపాయి ఎక్కువే ఇస్తామని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని కూడా ముఖ్యమంత్రి ఇటీవలే ప్రకటించారు. భూసేకరణకు సుమారు రూ. 2500 కోట్లు అవసరం అవుతుందని, మొదటగా టెండర్లు పిలిచే నార్లాపురం రిజర్వాయర్ నిర్మాణానికి 2,600 ఎకరాలు అవసరం అవుతాయని, అందులో ప్రభుత్వ భూమి వెయ్యి ఎకరాలు ఉండగా మరో 1600 ఎకరాల భూసేకరణ చేపట్టాలని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. ఇదిలాఉండగా ఈ పథకాన్ని గరిష్ఠంగా వచ్చే మూడేళ్ళలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.