తెలంగాణలోని సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులకు అదనపు చెల్లింపులకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో నంబర్ 146 ను జారీ చేసింది. రానున్న ఏడాది కాలంలో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఖజానాపై భారం పడినప్పటికీ అనేక పెండింగ్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యి రైతాంగానికి సాగునీరు అందుతుందనే ముఖ్య కారణంతో ఈ అదనపు చెల్లింపులు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర సర్కార్ తెలిపింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులను ఆమోదించిన ప్రభుత్వం మూడు దఫాలుగా అదనపు చెల్లింపులు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.
ఇదిలాఉండగా రాష్ట్రంలోని 13 భారీ, 12 మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే కొత్తగా సుమారు 29 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ నేపథ్యంలో 2016 జూన్ వరకు పెండింగ్ ప్రాజెక్టుల కింద కొత్తగా పది లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ప్రాజెక్టు, ప్యాకేజీల వారీగా పరిశీలన చేసి ఈ అదనపు చెల్లింపులు జరపాలని మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. వీటితోపాటు రూ. 1300 కోట్ల విలువైన మరో 12 మధ్య తరహా ప్రాజెక్టులలోనూ అదనపు చెల్లింపులు చెల్లించే ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం.