తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు ఆర్ధికసాయం అందించే ఫాస్ట్ పథకాన్ని పటిష్ఠంగా అమలుచేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో దళిత అభివృద్ధి, బీసీ, ఎస్టీ శాఖల ముఖ్య కార్యదర్శి, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, ఉన్నత విద్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ కమిటీ పని చేస్తుంది. అర్హతగల పేద తెలంగాణ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు రూపొందించిన ఫాస్ట్ పథకం అమలుచేయడానికి ఎలాంటి మార్గదర్శకాలు ఉండాలో ఈ కమిటీ ప్రభుత్వానికి వివరిస్తుంది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు విద్యకు సంబంధించి ఆర్ధికభారాన్ని తగ్గించేందుకు, నూతన విద్యార్థులకు చదువుల్లో ప్రోత్సహించేలా ఈ పథకం ఉంటుందని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులకే తెలంగాణ ఫీజులు అనే అంశంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్థానిక విద్యార్థులకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అందుకోసం 1956స్థానికతను ముఖ్య అంశంగా ప్రకటించింది. 1956నవంబరు 1 నాటికి తెలంగాణలో స్థిరనివాసం ఏర్పాటుచేసుకున్న తల్లిదండ్రుల పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. విద్యార్థులు తమ తల్లిదండ్రుల, పూర్వీకులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రెవెన్యూ అధికారికి అందజేయాల్సి ఉంటుంది.