mt_logo

తెలంగాణ అవతరణ మరో మూడునెలల్లో

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ఉభయ సభల్లో ఆమోదం పొందిన తెలంగాణ బిల్లు ఈ నెల 24న రాష్ట్రపతి వద్దకు చేరుకోనుంది. రాష్ట్రపతి సంతకంతో గెజిట్ వెలువడిన తర్వాత రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుంది. ఆ గెజిట్‌లోనే రాష్ట్ర ఆవిర్భావ తేదీ ఉంటుంది. అదే రోజు నుండి రెండు రాష్ట్రాలు తమ పరిపాలనను ఆరంభిస్తాయి. కేంద్ర మంత్రి జైరాం రమేష్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు అంశంపై పలు విషయాలు వెల్లడించారు. రెండు రాష్ట్రాలకూ ఒకటే సచివాలయం ఉంటుందని, ఆస్తులు, అప్పుల పంపకాలు పూర్తి చేసే విధంగా ఆవిర్భావ తేదీని నిర్ణయిస్తామని తెలిపారు. గతంలో ఏర్పాటైన మూడు రాష్ట్రాలకు మాదిరిగానే అన్ని కార్యక్రమాలూ పూర్తవ్వడానికి మరో మూడు నెలల సమయం పడుతుందని ఆయన చెప్పారు. అప్పాయింటెడ్ తేదీ నాటికి రెండు రాష్ట్రాలకూ ఇద్దరేసి ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు ఉంటారని, సీమాంధ్రకు 6 నెలల్లో కొత్త రాజధానిని నిర్ణయిస్తామని తెలిపారు. రెండు ప్రాంతాల ప్రజలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరారు. రాష్ట్రంలోనూ విభజన ప్రక్రియ ఏర్పాట్లు వేగవంతం అయ్యాయి. సచివాలయంలో ఉన్న 8 బ్లాకులను రెండు భాగాలు చేసి పంచనున్నారు. నగరంలో ఇంకా అవసరమైన భవనాలను ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ కోసం ఏర్పాటు చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *