ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని మన తెలంగాణ బిడ్డలు ఇటీవల అధిరోహించిన విషయం తెలిసిందే. ఎంతో కష్టమైనా, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో విజయకేతనం ఎగురవేసిన మాలావత్ పూర్ణ, ఆనంద్ కుమార్ లు తమ ఎవరెస్టు యాత్రను పూర్తిచేసుకుని బుధవారం డిల్లీలో అడుగుపెట్టారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన పూర్ణ, ఖమ్మం జిల్లాకు చెందిన ఆనంద్ కుమార్ లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ పాఠశాలల సొసైటీలో చదువుతున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఇచ్చిన ప్రోత్సాహంతో వీరిద్దరూ ఇంతటి ఘనవిజయాన్ని సాధించారు.
ఈ సందర్భంగా వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. పూర్ణ మాట్లాడుతూ, ఎవరెస్టు ఎక్కిన వాళ్ళ చరిత్ర విన్నాము, తెలుసుకున్నాము. కానీ నేనే ఎక్కిన అనుభవం మాత్రం మర్చిపోలేనిది. మళ్ళీ ఎక్కడానికైనా రెడీ అనే ధైర్యం కలిగింది అంటూ తనకు ఎదురైన అనుభవాలు చెప్పింది. ఎటు చూసినా మంచుపర్వతాలే అని, రెండు పర్వతాల మధ్య పగుళ్ళలో పడితే ఎక్కడకు చేరుకుంటామో అని భయం వేసేదని, నడుస్తూ ఉంటే పక్కన శవాలు కనిపించేవి అని వివరించింది. భయం వెంటాడుతున్నా భయపడితే ఇక పైకి ఎక్కలేమన్న తమ సెక్రెటరీ ప్రవీణ్ కుమార్ మాటలను గుర్తుచేసుకుని ఎవరెస్టు ఎక్కామని, వెనక్కు వెళ్ళిపోదామన్న ఆలోచన మాత్రం ఎప్పుడూ రాలేదని పూర్ణ తెలిపింది.
ఎవరెస్టు పర్వతం ఎప్పుడొస్తుందా అని మనసులో అనుకుంటూ ఉండేదాన్నని, కుటుంబ సభ్యులు గుర్తుకొచ్చేవారని, పర్వతం ఎక్కినతర్వాత జాతీయ జెండాను, ఆ తర్వాత తెలంగాణ జెండాను ఎగరవేయడం జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటన అని ఆమె చెప్పింది. దళితుల కోసం కృషి చేసిన బీఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని, ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కడానికి ప్రోత్సహించిన మాజీ ఐఏఎస్ అధికారి ఎస్ ఆర్ శంకరన్ చిత్రపటాన్ని ఎవరెస్టు మీద ప్రతిష్టించామని పూర్ణ చెప్పింది.
ఆనంద్ కుమార్ కూడా తన పర్వతారోహణ అనుభవాలు చెప్పాడు. అక్కడికి బయలుదేరినవాళ్ళలో తామే అతి చిన్న వారిమని, మొత్తం 65 మందిలో 40 మంది వెనక్కు తిరిగి వెళ్లిపోయారని చెప్పాడు. నడుస్తున్నప్పుడు అనేక శవాలు కనిపించేవని, అమ్మా, నాన్న గుర్తుకొచ్చేవారని, ఎవరెస్టు ఎక్కేలోగా ఇంకా ఎన్ని ఇబ్బందులు ఉంటాయోనని భయం పుట్టేదని వివరించాడు. తమ సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ప్రోత్సాహం లేకపోతే తాము ఈ సాహసాన్ని పూర్తి చేసి ఉండేవాళ్ళమే కాదని ఆనంద్ తెలిపాడు.