-కాంటేకార్ శ్రీకాంత్
కష్టమో నిష్టూరమో తెలంగాణపై చాలావరకు స్పష్టత వచ్చింది. టీఆర్ఎస్ రెండురోజుల మేధోమథనం.. కేసీఆర్ విలేకరుల సమావేశంతో తెలంగాణపై ఖుల్లంఖుల్లా తేలిపోయింది. కాంగ్రెస్ కు ఇప్పుడు ఇచ్చే ఉద్దేశం లేదని తేలిపోయింది. కాంగ్రెస్ మెడలు వంచేందుకు పోరాటం చేసినా ఇప్పుడు .. అప్పుడే మొదలైన ఈ ఎన్నికల సీజన్ లో మభ్యపెట్టే హామీలే తప్ప తెలంగాణ సాకారానికి చిత్తశుద్ధితో కూడిన పరిష్కారాన్ని కాంగ్రెస్ సచ్చినా ఇవ్వదు. అది సీమాంధ్ర పెట్టుబడిదారుల చేతిలో కీలుబొమ్మగా మారిపోయిన విషయం తేలిపోయింది. దానికి తెలంగాణ ఇచ్చే సంకల్పం లేదని తేలిపోయింది. మళ్లీ మామ్లా ప్రజల ముందుకు వచ్చింది.
ప్రజలే తేల్చాలి. ప్రజలే నిర్దేశించాలి. అవును ఇప్పుడు మళ్లీ ఉద్యమం ప్రజల ముందుకు.. ప్రజాతీర్పు కోసం వస్తున్న విషయం సుస్ఫష్టం. ఈలోగా తెలంగాణ ఉద్యమం ముందు అనేక సంక్లిష్ట సవాళ్లు ఉన్నాయి. వాటిలో అన్నింటికంటే ముఖ్యమైంది తెలంగాణ శక్తుల ఏకీకరణ. అనేక పాయలుగా చీలిపోయి సజీవంగా సాగుతున్న ఉద్యమాన్ని.. ఏకతాటిపైకి తీసుకొచ్చి.. సర్వశక్తులు కూడగట్టుకున్న మహోన్నత శక్తిగా నిలపడం.. ఉద్యమశక్తుల ఏకీకరణ. ఇదే క్లిష్టమైన సవాలు.
మరో సవాలు.. సీమాంధ్ర కుట్రలను తిప్పికొట్టడం.. సీమాంధ్ర కుట్రలకు సినానిమ్స్.. పర్యాయపదాలు కాంగ్రెస్.. టీడీపీ.. జగన్ కాంగ్రెస్.. గోతికాడి నక్కల్లా.. సిగ్గులేని కుక్కల్లా అవి ఇప్పటికే ఓట్ల వేటను ముమ్మరం చేశాయి.
తెలంగాణ పట్ల నయవంచనకు పాల్పడిన ఆ పార్టీలు మళ్లీ ద్రోహచింతనతోనే తెలంగాణలో అడుగుపెడుతున్న విషయం సుస్పష్టం ఎవరూ కాదనలేని వాస్తవం. ఎన్నికలు ముందే వచ్చినా..2014లో వచ్చినా ఈలోగా తెలంగాణ ఉద్యమాన్ని ఎలా నడపాలన్నది అతి కీలక విషయం. 1969 ఎన్నికల ద్రోహాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాలి. అప్పడు తెలంగాణ పేరు చెప్పుకొని గడ్డిపోచలాంటి నాయకులు మర్రి వృక్షాలై తెలంగాణకు మహా మోసాన్ని చేసి తెలంగాణ చరిత్రలో మహా కంటకులై నిలిచిపోయారు. అలాంటి అవకాశం ఇప్పుడు ఇవ్వకూడదు. ఉద్యమం ద్వారా ఏ ఒక్కరో లబ్ధి పొందకూడదు. నిఖార్సైన తెలంగాణవాదులకే పట్టంకట్టాలి.