mt_logo

తెలంగాణ ద్రోహులెవరో మెదక్ ప్రజలకు తెలుసు – హరీష్ రావు

మెదక్ ఎంపీ స్థానానికి కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెదక్ ఉపఎన్నిక తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ వాదికి మధ్య జరుగుతున్నదని, ఉద్యమాల పురిటిగడ్డ అయిన మెతుకుసీమ ప్రజలకు తెలంగాణ ద్రోహుల చరిత్ర మొత్తం తెలుసని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు గుణపాఠం చెప్తారని, నామినేషన్ వేయడంతోనే టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని తెలుస్తుందని, పోటీలో ద్వితీయ, తృతీయ స్థానాలు ఎవరివో తేలాల్సి ఉందని చెప్పారు.

తెలంగాణ కోసం ఉద్యమం చేసిన విద్యార్థులను, యువకులను కాంగ్రెస్ నాయకులు జైల్లో పెట్టించారని, ఇప్పుడు పోటీ చేస్తున్న సునీతా లక్ష్మారెడ్డి, జగ్గారెడ్డి ఇద్దరూ ఆంధ్రా సీఎంల అడుగులకు మడుగులొత్తుతూ తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్నారని, వీళ్ళు ఏ మొహం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన జగ్గారెడ్డి ముమ్మాటికీ తెలంగాణ ద్రోహి అని, తెలంగాణ వద్దని, ఉమ్మడి రాష్ట్రంతోనే అభివృద్ధి సాధ్యమని సోనియాకు లేఖ ఇచ్చిన జగ్గారెడ్డి గురించి తెలంగాణలో ఎవరిని అడిగినా చెప్తారని, అలాంటి వ్యక్తికి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారని హరీష్ రావు మండిపడ్డారు.

కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులే కరువయ్యారని, ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఆంధ్రా వాళ్ళేనని, కేంద్రంలో చక్రం తిప్పి జగ్గారెడ్డికి టిక్కెట్ ఇప్పించారని, సునీతా లక్ష్మారెడ్డిని బలవంతంగా పోటీలో నిలిపినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవడంతోనే ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలంతా పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని, రెండు రోజుల్లో జిల్లానుండి పెద్దసంఖ్యలో బీజేపీ నాయకులు టీఆర్ఎస్ లో చేరనున్నట్లు హరీష్ రావు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *