ఫొటో: ఒకచేతితో అన్నం తింటూ కూడా మరోచేతిలోని బందూకును వదలని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు. వారి పోరాటస్ఫూర్తికి ఈ ఫొటో నిలువెత్తు నిదర్శనం.
—
1948 సెప్టెంబర్ 17 నాడు తెలంగాణలో అధికారికంగా నిజాం పరిపాలన ముగిసి భారత ప్రభుత్వ పరిపాలన మొదలైంది.
అయితే ఈ తేదీని ఎట్లా జరుపుకోవాలనే అంశంపై తెలంగాణ సమాజంలో రెండు రకాల వాదనలు ఉన్నాయి.
భారత ప్రభుత్వం చేతిలోకి తెలంగాణ రాగానే సాయుధపోరాట కాలంలో గ్రామాలను వదిలివెళ్లిన దొరలు, దేశ్ ముఖులు మళ్లా ఊళ్లలోకి రావడం జరిగింది. మదరాసు నుండి దిగుమతి అయిన ఆఫీసర్ల వల్ల ఇక్కడ ఆంధ్ర వలసపాలన కూడా మొదలైంది. భారత సైన్యం చేతిలో అటు కమ్యూనిస్టు పోరాటకారులు, ఇటు ముస్లిములు ఊచకోతకు గురయ్యారు. కనుక ఈరోజును విద్రోహ దినంగా పాటించాలని కొందరు తెలంగాణ మిత్రుల అభిప్రాయం.
కానీ నిజాం రాచరిక పాలన నుండి, రజాకార్ల ఆకృత్యాల నుండి విముక్తి పొంది, ప్రజాస్వామ్య పాలన కిందికి వచ్చింది ఈ రోజే కాబట్టి దీనిని విమోచన దినంగా పాటించాలని ఇంకొందరి వాదన.
పై రెండు అభిప్రాయాల్లో నిజం ఉన్నది. అయితే ఈరోజుకు ఉన్న చారిత్రక ప్రాదాన్యతను మాత్రం విస్మరించలేం. కనుకనే తెలంగాణ జేయేసీ ఈ రోజును తెలంగాణ విలీన దినంగా పాటించాలని కోరింది.
తెలంగాణ చరిత్రలో నిస్సందేహంగా సెప్టెంబర్ 17 ఒక మైలురాయి.