భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల సీఎం కేసీఆర్ తెలంగాణ శాసనసభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రణబ్ మృతి పట్ల తెలంగాణ శాసనసభ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. భారతదేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని, 1970 సం. తర్వాత దేశ అభివృద్ధి చరిత్రలో ప్రణబ్ ముఖర్జీ పేరుకు ప్రత్యేక స్థానం ఉందని, దేశ ఆర్ధిక వ్యవస్థను అత్యున్నత స్థాయిలో నిలబెట్టారని గుర్తుచేశారు.
ప్రపంచంలోనే ప్రణబ్ ప్రముఖ ఆర్ధికవేత్తగా పేరు తెచ్చుకున్నారని, రాజకీయాల్లో ఆయన పేరు చిరస్మరణీయమని ప్రశంసించారు. మిత్రపక్షాలను కలుపుకొని పోవడంలో విశ్వసనీయుడిగా పేరుందని, ప్రతిపక్షాలను సిద్ధాంతపరంగా విమర్శించేవారని, వ్యక్తిగతంగా విమర్శించేవారు కాదని అన్నారు. భారతదేశ 13వ రాష్ట్రపతిగా అత్యున్నత పదవిని అలంకరించిన ఆయన జాతి నిర్మాణంలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2019 లో భారతరత్న అవార్డును అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు సాయపడిన వారిగా కాకుండా రాష్ట్ర విభజన బిల్లుపై ముద్ర వేసి తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారని కేసీఆర్ అన్నారు.
అనంతరం వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ ఎంతో సహకరించారని అన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై ముద్ర వేసి చరిత్రలో నిలిచిపోయారని, ఐదు దశాబ్దాలపాటు భారత రాజకీయాల్లో సుదీర్ఘ సేవలు అందించారన్నారు. తెలంగాణ ఏర్పడిన సమయంలో కేసీఆర్ తో పాటు పలువురం రాష్ట్రపతి భవన్ లో ప్రణబ్ ను కలిసామని, ఆ సందర్భంగా అనుకున్న లక్ష్యం సాధించారంటూ కేసీఆర్ ను ప్రణబ్ ప్రశంసించారని గుర్తుచేశారు. ప్రణబ్ తన పుస్తకంలో రెండు చోట్ల కేసీఆర్ గారి గురించి రాశారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని అర్ధం చేసుకున్న గొప్ప నేత అని, ఉద్యమ తీరుతెన్నుల గురించి అనేక సందర్భాల్లో కేసీఆర్ ప్రణబ్ కు వివరించగా ప్రణబ్ ముఖర్జీ సలహాలు ఇచ్చేవారని నిరంజన్ రెడ్డి గుర్తుచేశారు.