తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గా ఎన్నికైన జానారెడ్డి వారందరితో ప్రమాణస్వీకారం చేయించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ళ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీకి వచ్చి సీఎం చాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదిలా ఉండగా స్పీకర్ ఎన్నికకోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మధుసూదనాచారి స్పీకర్ పదవికి నామినేషన్ వేశారు. ఆయనకు అన్ని పార్టీలు మద్దతు తెలిపినట్లు సమాచారం. అంతకుముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్ పార్క్ చేరుకొని అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేసినతర్వాత కొద్దిసేపటికి అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.