తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం అయ్యాయి. శాసనసభ ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి లకు సభ నివాళులర్పించింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో సభలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. సభ్యులు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించారు. సభలో ఒక సీట్లో ఒకరే కూర్చునే విధంగా అసెంబ్లీలో అదనంగా 40 సీట్లు, మండలిలో 8 సీట్లు ఏర్పాటు చేశారు.౫
అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర అధికారులు, మీడియా ప్రతినిధులు, పోలీసులకు కరోనా టెస్టులు చేశారు. అసెంబ్లీ ఆవరణలో పలు ప్రాంతాల్లో సానిటైజ్ యంత్రాలు, మాస్కులు, ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేశారు. అసెంబ్లీకి వచ్చే ఫైల్స్ ను సానిటైజ్ చేసేందుకు ప్రత్యేక యంత్రాలు అమర్చారు. మీడియాను కూడా పరిమిత సంఖ్యలోనే అనుమతించారు. మంత్రుల పేషీ నుండి ఒక పీఏ, ఒక పీఎస్ ను మాత్రమే అనుమతించారు.