జులై 30 నాడు సీడబ్లూసీ తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం వల్ల సీమాంధ్ర నాయకుల నేతృత్వంలోని రెండు పార్టీలు ఈ ప్రాంతంలో దుకాణం మూసుకోవాల్సి వస్తోంది.
ఇందులో వైకాపా ఈపాటికే తెలంగాణలో మూతపడగా, నిన్నటి చంద్రబాబు మాటలతో తెదేపా కూడా తెలంగాణను వదిలేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు కనపడుతోంది.
అసలు చంద్రబాబు ఈ సమయంలో సీమాంధ్రలో యాత్ర చేయడమే తెలంగాణకు వ్యతిరేకమని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. కానీ చంద్రబాబు యాత్ర చేయడమే కాక, ఏకంగా ఆ యాత్రలో తెలంగాణా ఆకాంక్షలపై విషం చిమ్మడం రాజకీయ పరిశీలకులను విస్మయపరిచింది. నిన్నటి దాకా నేను తెలంగాణకు వ్యతిరేకం కాదని నమ్మబలికిన నారాబాబు, సీమాంధ్ర యాత్రలో తాను పచ్చి తెలంగాణ వ్యతిరేకినని తన నోటితోనే చెప్పుకున్నాడు.
NDA హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుకున్నది తానేనని, టీఆరెస్ తెలుగు జాతిని చీల్చడానికి కుట్రపన్నిందని అనడం ద్వారా చంద్రబాబు తన మనసులోని మాట బయటికి చెప్పినట్లయ్యింది.
తెలంగాణలో ఏండ్ల తరబడి ప్రజలు రోడ్డుమీదికి వచ్చినా ఎన్నడూ వారి బాధను పట్టించుకోని చంద్రబాబు, 30 రోజుల సీమాంధ్రుల ఆందోళనలపై ఎంతో బాధపడిపోతూ యాత్ర చేపట్టడం, ఆయన పక్షపాతానికి ప్రత్యక్షసాక్ష్యంగా కనపడుతోంది.
ఇక వైకాపాలాగానే తెదేపా పార్టీకి కూడా తెలంగాణలో నూకలు చెల్లినట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు. తెదేపా నుండి తెలంగాణ నాయకులు బయటికి రావడం మొదలవుతుందని వారు అంటున్నారు.
చంద్రబాబును నమ్ముకుని ఆయన వెంట ఇన్నాళ్లూ నడిచిన ఎర్రబెల్లి, మోత్కుపల్లి, రేవంత్ రెడ్డి లాంటి తెలంగాణ నాయకుల భవిష్యత్తు ఇప్పుడు అగమ్య గోచరమే!