తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తో కలిసి బుధవారం ముంబైలో టాటా సన్స్ సంస్థల చైర్మన్ రతన్ టాటాను కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రభుత్వ, ఐటీ కార్యక్రమాల గురించి రతన్ టాటాకు మంత్రి వివరించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్న దేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ టీ హబ్ గురించి కేటీఆర్ ప్రత్యేకంగా వివరించారు. అంతేకాకుండా ఫార్మా, ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో ఇంక్యుబేటర్ ద్వారా ఆయా రంగాలను అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాల గురించి చెప్పారు. సెప్టెంబర్ లో జరగనున్న టీహబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా మంత్రి కేటీఆర్ రతన్ టాటాను ఈ సందర్భంగా ఆహ్వానించారు.
అనంతరం రతన్ టాటా మాట్లాడుతూ తన అనుభవంలో తాను చూసిన అత్యుత్తమ పాలసీల్లో టీఎస్ఐపాస్ ఒకటని ప్రశంసించారు. పారిశ్రామిక రంగంలో అపార అనుభవం ఉన్న రతన్ టాటా సలహాలను, సూచనలను తప్పకుండా పాటిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. రతన్ టాటాను కలిసిన అనతరం మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను కూడా మంత్రి కేటీఆర్ కలుసుకుని పెట్టుబడి అవకాశాల పరిశీలన కోసం తెలంగాణలో పర్యటించాలని కోరగా తప్పకుండా వస్తానని ఆనంద్ మహీంద్రా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, అవకాశాలపై మంత్రి కేటీఆర్ వివరించిన తీరును ప్రశంసిస్తూ ఆనంద్ మహీంద్రా కేటీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. సరికొత్త ఆలోచనలు, జ్ఞానం, వ్యక్తిత్వం అన్నీ కలిసి ఉన్న వ్యక్తి కేటీఆర్ అని, తెలంగాణకు తమ మద్దతు ఉంటుందని కేటీఆర్ తో సమావేశం అనంతరం ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు.