తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇస్తూ త్వరలోనే ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ళు, నిధులు, నియామకాల కోసమని, ప్రాజెక్టుల విషయంలో సర్కారు చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల విషయంలో గత పాలకులు అనేక కొర్రీలు పెట్టారని, ఇప్పటికిప్పుడు ఎస్ఎల్బీసీ పూర్తికావాలంటే జరగని పని అని, టన్నెల్ మిషన్ నెలకు 0.6 కి.మీ. మాత్రమే తవ్వుతుందని, ఇంకా 25 కి.మీ తవ్వాల్సి ఉందని అన్నారు. టన్నెల్ పనులు పూర్తి కావడానికి ఇంకా రెండేళ్ళు పడుతుందని తేల్చిచెప్పారు.
కృష్ణా జలాల్లో తమ వాటా తమకు రావాల్సిందేనని, అవసరమైతే కృష్ణా ట్రిబ్యునల్ ముందు తానే వాదిస్తానని, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో భేషజాలు పక్కనపెట్టి అన్ని రాజకీయ పార్టీలూ కలిసి రావాలని కేసీఆర్ పేర్కొన్నారు. త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసుకుని ఎస్ఎల్బీసీ పై చర్చిద్దామని, డిండి, పెండ్లిపాక ప్రాజెక్టులు కడితేనే నక్కలగండికి నీరు వస్తుందని సీఎం తెలిపారు.