అంతర్జాతీయ స్థాయిలో సిద్ధమైన టీ హబ్ ఇంక్యుబేటర్ సెంటర్ హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. గవర్నర్ నరసింహన్, పారిశ్రామిక వేత్త రతన్ టాటా, ఐటీ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా టీ హబ్ ఆవిష్కరణ జరిగింది. ‘ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్ళండి’.. అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీ హబ్ ను గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన సౌకర్యాలతో కాటలిస్ట్ పేరుతో ప్రత్యేక భవనాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని అనేకమంది ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ స్టార్టప్ లకు రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని, టీ హబ్ దేశంలోని యువతకు ఎంతో ఉపయోగపడుతుందిని అన్నారు. త్వరలోనే టీ హబ్ రెండో ఫేజ్ ను కూడా ప్రారంభిస్తామని, టీ హబ్ ఇతర ఇంక్యుబేటర్ల భాగస్వామ్యంతో పనిచేస్తుందని తెలిపారు. యువభారత్ ప్రపంచానికి సవాల్ విసురుతుందని, హైదరాబాద్ ను స్టార్టప్ ల రాజధానిగా రూపొందిస్తామన్నారు. గూగుల్, ఫేస్ బుక్ తర్వాత సంచలనం భారత్ లోనేనని, అది కూడా హైదరాబాద్ నుండే ప్రారంభం కావాలని కేటీఆర్ పేర్కొన్నారు.